తెలంగాణ పరిపాలన లో కాంగ్రెస్ మార్కు మరోసారి బయట పడింది. ప్రభుత్వ పరిపాలనలో నేరుగా పార్టీ నాయకులు తిష్ట వేయటం కాంగ్రెస్ లో ఆనవాయితీ. ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ నేరుగా సచివాలయంలోనే మీటింగ్ లు పెట్టి సమీక్షలు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది.
…
కాంగ్రెస్ పార్టీకి మీనాక్షి నటరాజన్ ను ఇంచార్జ్ గా వేసినప్పుడు సోషల్ మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేశారు. ఢిల్లీ నుంచి ఆమె రైలులోనే ప్రయాణం చేస్తారు అనీ, లో ప్రొఫైల్ లో ఉంటారని కథనాలు గుప్పించారు. కానీ తర్వాత తర్వాత అర్థం అయింది ఏమిటంటే… ఆమె కూడా కాంగ్రెస్ మార్కు నాయకురాలే అని. ఇందుకు ఉదాహరణ గా.. కొద్ది రోజులుగా మీనాక్షి నటరాజన్ నేరుగా సచివాలయంలోనే తిష్ట వేసుకొని సమీక్షలు తీసుకొంటున్నారు. ఇది ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
…
నిజానికి గతంలో ఇంఛార్జ్ గా వ్యవహరించిన దీపాదాస్ మున్షీ మీద చాలా విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఆమెకు ప్రత్యేకమైన బస ఉండేదని చెబుతారు. ప్రభుత్వం లో పని కావాల్సిన కాంట్రాక్టర్లు, వ్యాపారులు అక్కడకు వెళ్లి.. మేడమ్ బ్లెస్సింగ్స్ తీసుకొనే వారు. అక్కడ నుంచే దీపాదాస్ మున్షీ నేరుగా ఐ ఎ ఎస్ అధికారులను పిలిపించుకొని పనులు పురమాయించేసేవారు అని టాక్.
…
ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నేరుగా సచివాలయంలోనే మీటింగ్ లు పెట్టడం తో మ్యాటర్ కాస్తా బయటకు పొక్కింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల విషయంలో మంత్రుల సబ్ కమిటీ తో మీనాక్షి నటరాజన్ మీటింగ్ పెట్టుకొన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ ఇచ్చిన ఆదేశాలను తెలియచేశారు. అందుకు అనుగుణంగా మంత్రుల సబ్ కమిటీ నుంచి రిపోర్ట్ రావాలంటూ డెడ్ లైన్ పెట్టినట్లు సమాచారం. అలాగే సచివాలయంలో నేరుగా పార్టీ క్యాడర్ నుంచి ఆమె వినతి పత్రాలు సమర్పించారు అని కూడా వార్తలు వస్తున్నాయి.
…..
అటు, కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ వాదన్ని ఖండిస్తున్నాయి. సెంట్రల్ యూనివర్శిటీ విషయంలో సలహాలు ఇచ్చేందుకు మాత్రమే మీనాక్షి అందులో పాల్గొన్నారు తప్పితే, ఇందులో అధికారాల దుర్వినియోగం లేదు అని చెబుతున్నారు. నిరాడంబరతకు మారు పేరైన మీనాక్షి నటరాజన్.. ఇప్పటికీ అదే బాటలో ఉన్నారని చెప్పుకొని వస్తున్నారు.