ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థుల వెతలు తీర్చేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా. వైద్యవిద్యకోసం అక్కడికి వెళ్లిన పిల్లలకోసం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వైద్యవిద్యకోసం చైనా తరువాత అంతపెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు వెళ్తున్న దేశం ఉక్రెయిన్. ప్రతీ విషయంపై ట్విట్టర్ వేదిగ్గా స్పందించే ఆనంద్… భారత్ లో ఆ స్థాయిలో వైద్యకళాశాలల కొరత ఉందనే విషయం ఆశ్చర్యంకలిగించిందన్నారు. అందుకే మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకోసం పరిశీలిస్తానని ట్వీట్ చేశారు. సీఈవో సీపీ గుర్నారీని ట్యాగ్ చేస్తూ
‘ మన దగ్గర మెడికల్ కాలేజీలు లేవా ? ఎందుకు ఇంత మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు.? దీనిపై దృష్టిసారించాల్సి ఉంది. మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెట్టేందుకు అవకాశం ఉందా? అని అన్నారు ఆనంద్ మహీంద్రా. అయితే మహీంద్ర స్పందన, సరికొత్త ఆలోచనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.