గతేడాది నవంబర్లో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో మౌల్వీ అబ్దుల్ రహీమ్(43)ని రాజస్థాన్లోని కోట జిల్లాలోని పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
స్పెషల్ జడ్జ్ దీపక్ దూబే తీర్పులో బాధితురాలైన బాలికను ఉద్దేశించి, తన కోసం ఒక కవితను చదివారు. “ఓ నా చిన్న అమాయకపు రాణి, సంతోషంగా ఉండండి.. నిన్ను ఏడిపించిన దుష్ట రాక్షసుడిని తన జీవితపు చివరి శ్వాస వరకు కటకటాల వెనకే ఉండేలా ఆదేశించాం. ఇప్పుడు నీవు నిర్భయంగా ఎగురుతూ కలలన్నింటినీ నెరవేర్చుకోవచ్చు. ఉల్లాసంగా, సంతోషంగా ఉండు” అంటూ హిందీలో కవితను చెప్పారు.
మైనర్పై లైంగిక వేధింపుల కేసు నవంబర్ 2021 నాటిది. కోటలోని రాంపుర నివాసి అయిన మౌల్వీ అబ్దుల్ రహీమ్ ఉర్దూ ఉపాధ్యాయుడు, మదర్సాలో ఉర్దూ బోధించడానికి బాధిత మైనర్ గ్రామమైన కొట్సువాకు వెళ్ళాడు. మైనర్ బాలిక మదర్సాలో ఇతర విద్యార్థులతో ఉర్దూ ట్యూషన్లకు హాజరయ్యేది. నవంబర్ 13న మౌల్వీ ఆమెను క్లాస్ ముగిసిన తర్వాత ఆగమని చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు.
బాలిక కన్నీళ్లతో కేకలు వేస్తూ సాయంత్రం ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక జరిగిందంతా తన తల్లికి చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు మౌల్వీపై అధికారికంగా దేగోడ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మైనర్ బాలికను శారీరకంగా హింసించినందుకు మౌల్వీని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు వైద్య, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి 6 ఏళ్ల బాలికపై మౌల్వీ అత్యాచారం చేసినట్లు నిర్ధారించారు. ఐపీసీ సెక్షన్ 376, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోలీసులు నెల రోజుల్లో చార్జిషీటు కూడా దాఖలు చేశారు. అయితే 13 మంది సాక్షులు, 23 సాక్ష్యాధారాలను ధృవీకరించిన తర్వాతే నిందితున్ని కోర్టు దోషిగా పరిగణించింది. నిందితుడు ఒక కుమార్తె, ముగ్గురు కుమారుల తండ్రి.