దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సామూహికంగా జాతీయ గీతాలాపన కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా అందరూ జనగణమన ఆలపించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అబిడ్స్‌లో ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ప్రజలు ఒకే సమయంలో ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. సిగ్నల్స్ వద్ద నిమిషం పాటు రెడ్ సిగ్నల్ ఇచ్చి అంతా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు అధికారులు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో జాతీయ గీతం పాడారు. దీంతో హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ నిమిషం పాటు అంతా స్తంభించిపోయింది. అన్ని మెట్రో రైళ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు, అన్ని వాహనాలు, ప్రజానీకం ఒక్కసారిగా నిలిచిపోయింది.