మన తెలంగాణ గడ్డమీద మన సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా చేసుకునే పండగ బతకమ్మ. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుక సందర్భంగా మన ఆడబిడ్డల్ని మనం గౌరవించుకుంటాం. ఒక్కో రోజుకి ఒక్కో పేరుతో పిలుచుకుంటూ పండగ చేసుకుంటాం.
మొదటి రోజు బతుకమ్మ పేరు వెనక చిన్న కారణం ఉంది. దీనిని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. సాధారణంగా పూలను చేయి లేదా కత్తెరతో కట్ చేస్తాం. కానీ, కొందరు నోటితో కూడా తుంచి బతుకమ్మను తయారు చేస్తారు. ఆ విధంగా చేసే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు . సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళల చేతుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఇక రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నాన బియ్యం బతుకమ్మ, అయిదోరోజు అట్ల బియ్యం బతుకమ్మ, ఆరో రోజున అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ అని పిలుచుకుంటారు.
మన అందరి పండగ అయిన బతుకమ్మను జరుపుకునేందుకు పట్టణాలు పల్లెలు పోటీ పడుతున్నాయి.
ప్రతి గ్రామం రంగురంగుల పూలతో సుందరంగా మారుతోంది. తెలంగాణలోని పల్లెల్లో బతుకమ్మ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తున్నారు. పెళ్లైన ఆడవాళ్లు పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ కోసం మగవాళ్లు పొలాలకు పోయి తంగేడు, మందారం, బంతి, సీతజడ, తామరపూలతో పాటు ఇంకా ఎన్నో రకాల పూలను తీసుకొస్తే.. వాటితో ఆడవాళ్లు బతుకమ్మను పేరుస్తారు.
బతుకమ్మకు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం పెడతారు. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, బెల్లం, పాలతో చేసినవి సమర్పిస్తారు.
మన తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకోవడమే బతుకమ్మ పండగ గొప్పతనం. బతుకమ్మను తలకు ఎత్తుకున్న ఆడబిడ్డను దేవతగా భావించి ఇంటిళ్లపాది కాళ్లు కడిగి దండం పెడతారు. మన హైందవ సంస్కృతిలోని గొప్పతనం కూడా ఇదే.