లోన్ అడిగితే ఇవ్వనందుకు ఏకంగా బ్యాంకుకే నిప్పుపెట్టాడో ప్రబుద్ధుడు. కర్నాటక హవేరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తిని రత్తిహళ్లికి చెందిన వాసీం హజారత్ సాబ్ ముల్లాగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం లోన్ కోసం కాగినెల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెడుగొండ కెనరా బ్యాంకును ఆశ్రయించాడు వాసీం. డాక్యుమెంట్లన్నీ పరిశీలించి… అతని CIBIL స్కోర్ తక్కువగా ఉందని లోన్ అప్లికేషన్ ను బ్యాంక్ తిరస్కరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితుడు రాత్రి పూట వచ్చి బ్యాంక్ ఉన్న భవనం కిటికీని పగులకొట్టాడు. లోపల పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. భవనం నుంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫైరింజన్లతో మంటలు ఆర్పినా అప్పటికే కంప్యూటర్లు, ఫ్యాన్లు, లైట్లు, పాస్ బుక్ ప్రింటర్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్ వంటి 12 లక్షల విలువైన సామగ్రి కాలిపోయింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.