
……………………………………………………
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీదీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ … సర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ పక్రియలో జోక్యం చేసుకోవడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది.
……………………………………..
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్నది దీదీ ఆరోపణ. ఈ ‘సర్’ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని లేదా మార్పులు చేయాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ వాదనలను ధర్మాసనం పూర్తిగా అంగీకరించలేదు. రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన మమతా సర్కారుకు మింగుడుపడని అంశంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన మైక్రో అబ్జర్వర్ల నియామకంపై దీదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో పారదర్శకత కోసం వారు ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు పరోక్షంగా స్పష్టం చేసింది. ఇది మమతా బెనర్జీ రాజకీయ వ్యూహాలకు గట్టి దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
……………………………..
ముఖ్యంగా, ‘సర్’ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, అభ్యంతరాల స్వీకరణకు కేవలం ఒక వారం మాత్రమే గడువు పొడిగించింది. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొనడం ద్వారా, ఎన్నికల సంఘం పనుల్లో వేగం పెంచాలని సూచించినట్లయింది. కోర్టు లో విచారణ కు మమతా బెనర్జీ స్వయంగా హాజరై వాదనలు వినిపించటం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.



