వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీలో పాల్గొంటున్న మోదీ.. సీఎం దీదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం నాడు రాష్ట్రంలోని వర్ధమాన్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సారి నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ క్లీన్‌బౌల్డ్ అవ్వడం ఖాయమన్నారు. ఈ విషయం తనకు కూడా తెలుసని.. అందుకే మమతా బెనర్జీలో కోపం పెరుగుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల్లో టీఎంసీని ప్రజలు తుడిచిపెట్టేశారని అన్నారు. ఎన్నికల సమయంలోనే తాము శోభా మజుందార్‌ను కోల్పోయామని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. టీఎంసీ గుండాలు క్రూరంగా కొట్టి చంపారని.. ఈ విషయాన్ని తాము ఎన్నటికీ మరిచిపోమన్నారు. అంతేకాదు.. ఓ నిజాయితీ పోలీసు ఆఫీసర్ని బెంగాల్లో కొందరు కొట్టి చంపారని.. ఆ కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లికూడా ప్రాణాలు విడిచిందన్నారు. ఆమె సీఎంకు తల్లిలాంటిది కాదా అని సూటిగా ప్రశ్నించారు.