తనను నాన్ ముస్లింగా పరిగణించాలంటూ మలేషియాలో ఓ ముస్లిం మహిళ కోర్టును ఆశ్రయించింది. తాను ముస్లిం తల్లిదండ్రులకు జన్మించినప్పటికీ, తాను ఎప్పుడూ ఇస్లాంలో లేనని అంటోంది. ఆమె తండ్రి కూడా మధ్యలో ఇస్లాంలోకి మారిన వ్యక్తే.
కన్ఫ్యూషియనిజం, బౌద్ధమతాన్ని అభ్యసించడానికి ముస్లిమేతరుగా పరిగణించాలని కోరే మహిళ తన కేసును కొనసాగించవచ్చో లేదో మలేషియాలోని హైకోర్టు జూన్ 15న నిర్ణయిస్తుంది.
మహిళ మార్చి 4న షరియా అప్పీల్ కోర్ట్, షరియా హైకోర్టు, ఫెడరల్ టెరిటరీస్ ఇస్లామిక్ రిలిజియస్ కౌన్సిల్ (Maiwp) సహా మలేషియా ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేస్తూ జ్యూడిషియల్ రివ్యూ పిటిషన్ను దాఖలు చేసింది.
ఆమె తరపున న్యాయవాది, అటార్నీ జనరల్ ఛాంబర్స్ నుంచి వాదనలు విన్న తర్వాత.. హైకోర్టు న్యాయమూర్తి దాతుక్ అహ్మద్ కమల్ Md షాహిద్ ఆ మహిళకు జ్యూడిషియల్ రివ్యూకు అనుమతి మంజూరు చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం వెల్లడించాడనికి తేదీని నిర్ణయించారు.
ఈ పిటిషన్ ను జూలై 2020లో దాఖలు చేసింది. డిసెంబర్ 2021లో ముస్లిం మతాన్ని విడిచిపెట్టాలనే ఆమె నిర్ణయాన్ని అంగీకరించడానికి షరియా హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులపై సివిల్ కోర్టు స్టే విధించాలని మహిళ అభ్యర్థిస్తోంది. తాను ఇకపై ముస్లిం కాదని, కన్ఫ్యూషియనిజం, బౌద్ధమతాలను ఆచరించే హక్కు తనకు ఉందని సివిల్ హైకోర్టు ప్రకటించాలని కూడా ఆమె కోరుతోంది.
తన అప్పీల్లో, తాను ఇస్లాం సిద్ధాంతాలను ఎన్నడూ అంగీకరించలేదని.. తనకు మతంపై విశ్వాసం లేదని మహిళ పేర్కొంది. పంది మాంసం, మద్యం సేవించడం అలవాటు చేసుకున్నట్లు కోర్టులో ఆ మహిళ అంగీకరించింది. ఇస్లాంలో పంది మాంసం, మద్యం రెండూ నిషేధం. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఆమె తల్లి వద్దే పెరిగింది. తల్లి ఇస్లాంను బలవతంగా రుద్దేప్రయత్నం చేస్తోంది.