గాంధీజీ జన్మించి 150 ఏళ్లు పూర్తయ్యాయి. అన్నేళ్ల క్రితం జన్మించిన గాంధీజీ ని ఎందుకు స్మరించుకోవాలి?
భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి నేతృత్వం వహించిన గాంధీజీ …అంతకుముందు 1893 నుంచి 1914 వరకు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అక్కడ నల్లవారిపై బ్రిటీష్ పాలకుల వివక్షను ప్రశ్నిస్తూ పోరాటం చేశారు..
సత్యాగ్రహాన్ని గాంధీ మొట్టమొదటిసారి దక్షిణాఫ్రికాలో ప్రయోగించారు. అక్కడ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతూనే ,మరోపక్క భారత్ లో స్వాతంత్ర్యోద్యమాన్ని ఎలా నడపాలో ఆలోచించసాగారు.
1909లో” హిందూ స్వరాజ్” అనే పుస్తకం రాశారు. దాన్ని లండన్ లో ఉన్న తన భారతీయ మిత్రులకు , తనతో సన్నిహిత సంబంధం ఉన్న ఆంగ్లేయులకు కూడా పంపించారు. దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలోనే 1912 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే గాంధీజీని కలుసుకొని అనేక విషయాలు చర్చించారు.అప్పటినుంచే వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.
గాంధీజీ1914లో ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో కూడా గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే సహా కొందరు ఆంగ్లేయ ప్రముఖులతో చర్చలు జరిపారు..
భారత స్వాతంత్ర్య ఉద్యమం లో తన భాగస్వామ్యం ఏంటి అనేది స్పష్టత వచ్చిన తరువాత 1915లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు.
గోఖలే సూచనమేరకు గాంధీజీ, దేశంలోని ప్రముఖ ప్రదేశాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాలు తిరిగారు. ఆ సందర్భంగా కొన్ని ఘటనలు ఆయన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి, కదిలించాయి, ఆలోచింప చేశాయి.
అప్పుడే శ్రీ రామ చంద్రుడు ఈ దేశపు అంతరిక శక్తి అని గుర్తించారు. అందుకే ఈ దేశంలో సామాన్య ప్రజలను కదిలించటానికి రామరాజ్యం నిర్మాణం చేసుకుందామని పిలుపునిచ్చారు.
ఈ దేశ ప్రజలలో సత్యం, ధర్మం ఎడల ఉన్న నిష్ఠ గాంధీజీ గుర్తించారు . ఈ దేశం అంటే గ్రామీణ దేశమని అర్థం చేసుకోవడమే కాదు.. బ్రిటిష్ పరిపాలనలో ధ్వంసమైన గ్రామీణ క్షేత్రం గాంధీజీని బాగా కలచివేసింది. గ్రామీణుల మనసులు జయించాలని నిశ్చయించుకున్నారు. అందుకే తన జీవన శైలిలో చాలా మార్పులు చేసుకున్నారు.
కొల్లాయి గుడ్డ కట్టుకొని సాధారణ వ్యక్తులలో కలసిపోయారు. అట్లాగే సత్యాగ్రహాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయంచుకొన్న గాంధీజీ… 1915 వ సంవత్సరంలోనే సత్యాగ్రహ ఆశ్రమాన్ని నిర్మించారు. 1917లో సబర్మతి ఆశ్రమం ప్రారంభించారు.
ప్రపంచంలో ఏ దేశమైనా అన్యాక్రాంతం అయినప్పుడు దాని ముందు రెండే మార్గాలు ఉంటాయి. ఆక్రమించిన శక్తులకు లొంగిపోవడం, లేదా ఎలాగైనా స్వాతంత్ర్యాన్ని సంపాదించడం.
ప్రపంచం లో చాల దేశాలు విప్లవ కార్యకలాపాల ద్వారా తన స్వేచ్ఛను సాధించుకున్నాయి..
భారతీయ సమాజం బ్రిటీష్ వాళ్లకు అణిగిమణిగి ఉండలేదు. అలాగని పూర్తి హింసామార్గంలో వెళ్లలేదు.
ఆసమయంలోనే ఎందరో మహా పురుషులు అంతర్ముఖులై ప్రపంచంలో ఇంత గొప్ప సంస్కృతి, నాగరికత కలిగిన దేశం ఎందుకు పరాధీనం అయిందోనని ఆలోచించసాగారు.
ఆ పరంపరలోనివారే రామకృష్ణ పరమహంస, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, స్వామి దయానంద, అరవిందుడు,తిలక్, రవీంద్రనాథ్ ఠాగూర్ బంకించంద్ర, లాలాలజపతిరాయ్, గోవింద రానడే మొదలైనవారు.
ఎవరిపద్ధతుల్లో వారు దేశ ప్రజలను స్వాతంత్ర్య పోరాటానికి మానసికంగా సిద్ధం చేస్తూ ఒక గొప్పభావ విప్లవాన్ని సృష్టించారు.
గాంధీజీ ఎంచుకొన్న మార్గం రాజకీయ పోరాటం, సంస్కరణల ఉద్యమం.
పోరాటంలో సత్యాగ్రహం మౌలికమైన అంశం. సత్యాగ్రహం అంటే నిర్భయత్వం అంటే ఎవరికీ భయపడకుండా, ఎవరినీ భయపెట్టకుండా న్యాయమైన లక్ష్యాన్ని సాధించుకోవటం. సత్యాగ్రహం ప్రపంచంలో అందరినీ ప్రభావితం చేసింది.
స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ చేతిలో అడవిలోని గడ్డి , సముద్రంలోని ఉప్పు, నూలు వడికే చరఖాలే బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగులేని అస్త్రాలు. ఆ అస్త్ర ప్రయోగానికీ యావత్ దేశ ప్రజలను సిద్ధం చేశారు. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు ప్రయోగ శాలలో జరిగితే… సత్యం, ధర్మం, గుణ వికాసానికి సమాజమే పెద్ద ప్రయోగశాల. ఆ దిశలో ఈ దేశంలో అనేక ప్రయోగాలు జరిగాయని చెప్పవచ్చు.
గాంధీజీ పోరాటంలో కొన్ని అపశృతులు కూడా దొర్లాయి. తదనంతర కాలంలో ఆ ఫలితాలు చవిచూడవలసి వచ్చింది. అందులో ప్రముఖమైనది ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీజీ సమర్థించటం. దాని పరిణామం ఈ దేశ విభజనకు దారితీసింది .
హిందూ- ముస్లిం ఐక్యతతోనే స్వేచ్ఛ సాధ్యం అనే ఆలోచనతో చేసిన ప్రయత్నాలు పక్కదారి పట్టాయి.
గాంధీజీ కాంగ్రెస్ లో 1920నుంచి స్వాతంత్ర్య పోరాటం చేశారు. 1934లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఒక ట్రస్టీ గా కాంగ్రెస్ కు మార్గదర్శనం చేసుకొంటూ వచ్చారు. 1947లో దేశానికి స్వతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీజీ అన్నారు.
దాన్ని లోక సేవక సంఘంగా మార్చాలని వీలునామా కూడా రాశారు. అందులో గాంధీజీ ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పటికీ … తరువాత ప్రభుత్వానికి ,పార్టీకి నాయకత్వం వహించిన పెద్దలు లెక్కచేయలేదు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత సర్వోదయ కార్యక్రమాలే లక్ష్యం కావాలని గాంధీజీ చెబుతుండేవారు. గ్రామవికాసంతోనే దేశం పురోగమిస్తుందనీ అంటుండేవారు..
వ్యవసాయంతోపాటు గ్రామంలో కుటీర పరిశ్రమల ద్వారా గ్రామానికి అవసరమైన వస్తువులను గ్రామంలోనే తయారుచేసుకోవాలి.. అలా గ్రామం స్వావలంబన జరగాలన్నది గాంధీజీ ఆకాంక్ష.
ఇంగ్లండ్ విద్యలో ఈత నేర్పడం, ఓడ నడపటం ఒక భాగంగా ఉండేవి. ఎందుకంటే అక్కడ నాలుగువైపులా సముద్రంఉంటుంది. అలాగే మనది గ్రామీణభారతం. విద్యాబోధనలో గ్రామీణ వృత్తులు కూడా భాగం కావాలని గాంధీ చెప్పారు, దేశంలో ఉత్పత్తి ఎట్లా ఉండాలి అంటే మనకు కావలసింది మాస్ ప్రొడక్షన్ కాదు ప్రొడక్షన్ బై మాస్ కావాలనేవారు..
అధికోత్పత్తి కంటే అధిక జనుల ద్వారా ఉత్పత్తి చేయటం ముఖ్యమని… వికేంద్రీకరణ, గ్రామస్వరాజ్యం సాధించినప్పుడే దేశం బాగుపడుతుంది అని గాంధీజీ అనేవారు.
ఋగ్వేదంలో చెప్పినట్టు ‘గృహే గృహే దమే దమే’ అంటే ప్రతి ఇంటిలో సాధన జరుగుతూ ఉండాలి. దానితో కుటుంబంలో ఒక ఆత్మీయ భావం, క్రమశిక్షణ, నిరంతర పరిశ్రమ అలవడతాయి.
ట్రస్ట్ షిప్ అంటే ధర్మకర్తృత్వ గురించి చెబుతూ ఉండేవారు గాంధీ. కుటుంబంలో పిల్లలు తమ బాధ్యతను తాము నిర్వహించే సామర్థ్యం వచ్చేవరకు తల్లిదండ్రులు తమ కంటే ఎక్కువగా ఆ పిల్లల గురించి ఆలోచిస్తారు, ఆ స్వభావం దృష్టిలో ఉండాలని చెప్పారు. వినోబాభావే ఉన్నంతకాలం అది కొనసాగింది.
ఆ తరువాత గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్, గ్రామ వికాసం , స్వదేశీ గురించి కూడా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు.
అసలు నిజంచెప్పాలంటే గాంధీజీ ఆలోచనలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో కనపడతాయి. సంఘంలో గ్రామ వికాసం స్వదేశీ, వికేంద్రీకృత వ్యవస్థలు అన్నీ ఒక భాగం. ఈ దేశం ఈ దేశం గా నిలబడాలంటే ఈ దేశానికి సంబంధించిన పరంపరాగత ఆలోచనలను కాలానుగుణ మార్పులు చేసుకుంటూ ముందుకు పోవాలి. నాటి గాంధీ ఆలోచనలను ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఈ మధ్యే ఓ సందర్భంలో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ గాంధీజీ ఆదర్శాలు భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా మనం ఏమి చేయగలం? సరికొత్త ఆలోచనలతో గాంధీజీ ఆదర్శాలను ప్రజల ముందుంచాలనే దానిపై మేధావులు,పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగంలో దిగ్గజాలను ఆహ్వానిస్తున్నాను. అసహనం,బాధితులకు తావులేని సుఖ సంపన్నమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు మనం భుజం భుజం కలిపి నడుద్దాం. గాంధీజీకి అత్యంత ఇష్టమైన వైష్ణవ జనతోపాటలో చెప్పినట్లు అసలైన మనిషి అర్థాన్ని సాకారం చేయటమే మనంగాంధీజీకి సమర్పించే నిజమైననివాళి’ అన్నారు .