…………………………………
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అర్బన్ ఓటర్ మనస్తత్వాన్ని తెలియచేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. మొత్తం 2,869 స్థానాలకు గాను 1,372 స్థానాలను కైవసం చేసుకుని, అభివృద్ధి రాజకీయాలపై ప్రజల విశ్వాసం ఎంత బలంగా ఉందో నిరూపించింది.
………………………………………….
ఆసియాలోనే అత్యంత సంపన్న మున్సిపల్ సంస్థగా పేరుగాంచిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ దూకుడు చూపించింది. దశాబ్దాలుగా కొనసాగిన ఠాక్రేల ఆధిపత్యానికి స్పష్టంగా తెరదించాయి. బీజేపీ–శివసేన షిండే కూటమి మొత్తం 118 స్థానాలు సాధించి, 114 మెజారిటీ మార్కును సునాయాసంగా దాటింది. ఈసారి ముంబైకి కాషాయ మేయర్ వస్తారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.
……………………………………………………..
రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, బీజేపీ 89 స్థానాలు గెలుచుకోగా, మిత్రపక్షమైన శివసేన (షిండే వర్గం) 29 స్థానాలను దక్కించుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 65 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కేవలం ఆరు స్థానాలకే పరిమితమవడం విశేషం. కాంగ్రెస్ 24 స్థానాలతో స్వల్ప ఉనికినే చూపగలిగింది..
………………………………………………….
ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే… రాజకీయంగా విభేదాలున్న ఠాక్రే సోదరులు ఉద్ధవ్–రాజ్ కలిసి బరిలోకి దిగినప్పటికీ, మరాఠా ప్రజలు వారిని విశ్వసించలేదు. భావోద్వేగ రాజకీయాలకు బదులు, అభివృద్ధి, స్థిరత్వం, పాలనపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇది ఠాక్రే బ్రాండ్ రాజకీయాలకు ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
……………………………………….
ఇదే సమయంలో పవార్ కుటుంబం పుణె, పింప్రి–చించ్వాడ్లలో కలిసినప్పటికీ, బీజేపీ విజయరథాన్ని ఆపలేకపోయింది.ఈ ఫలితాలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, “ఇది అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు ఇచ్చిన ఆమోదం. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీయే ప్రజానుకూల పాలనకు మద్దతుగా నిలిచారు. అభివృద్ధి, దార్శనికతే మా బలాలు” అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా “ప్రజలు నిజాయితీని, అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే బీజేపీకి రికార్డు స్థాయి తీర్పు ఇచ్చారు” అంటూ ధన్యవాదాలు తెలిపారు.
…………………………
మొత్తంగా చూస్తే, ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వాలకు మహారాష్ట్ర ప్రజలు బలమైన మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టంగా చాటాయి. స్థానిక ఎన్నికలైనా, ప్రజల తీర్పు మాత్రం రాష్ట్ర–జాతీయ రాజకీయాలపై గట్టి సంకేతం ఇచ్చిందన్నది రాజకీయ వర్గాల ఏకగ్రీవ అభిప్రాయం.




