టీటీడీ ఆస్థాన పండితుడు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూశారు. 96 ఏళ్ల వయసులో పలు వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తొలిఘడియలోనే ఆయన నిర్యాణం చెందారు. ఎస్వీబీసీ వంటి భక్తి చానళ్ల ద్వారా ఆయన ప్రవచనాలు వినని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక దృక్పథాల సమ్మేళనంగా ఆయన ప్రవచనాలుండేవి. అందుకే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆసక్తిగా వినేవారు. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, ప్రతిఒక్కరిలోనూ ఆధ్యాత్మిక చింతన పెంచేలా ఆయన ప్రవచనాలు, ప్రసంగాలు సాగేవి. మల్లాది సొంతూరు గుంటూరు జిల్లా క్రోసూరు. కానీ ఆయన చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మల్లాది మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.