ఈ జనవరిలో ప్రయోగరాజు వేదికగా మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు. లక్షల మంది విచ్చేసే ఈ పవిత్ర కార్యక్రమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. విశిష్టంగా భావించే మహా కుంభమేళాకు చాలా ప్రత్యేకత ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. ఈసారి మహా కుంభమేళాను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేళాకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు చేయనున్నారు.
కుంభమేళా అనేది అర్థకుంభమేళా, పూర్ణకుంభమేళా, మహాకుంభమేళా అనే వర్గాలుగా జరుగుతుంటుంది. ఈ మూడూ వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. దేశంలోని నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుంటుంది. వీటిలో హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్‌లున్నాయి. కుంభమేళా సమయంలో భక్తులు గంగా, గోదావరి, క్షిప్రా నదులలో కూడా భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు.
ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేళాను అర్ధ కుంభమేళా అంటారు. ఇది యూపీలోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లలో మాత్రమే జరుగుతుంది. ఈ అర్థకుంభమేళాకు పెద్ద సంఖ్యలో మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. పూర్ణ కుంభమేళా విషయానికొస్తే ఇది ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమ తీరంలో మాత్రమే జరుగుతుంది.
గతంలో అంటే 2013లో పూర్ణకుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025లో మరో పూర్ణ కుంభమేళా వచ్చింది. అయితే దీనికి మహాకుంభమేళా అనే పేరుపెట్టారు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో 12 సార్లు పూర్ణ కుంభమేళా జరిగిన దరమిలా ఇప్పుడు మరోమారు జరుగుతున్నందున దీనికి మహాకుంభమేళా అనే పేరు పెట్టారు.
ఇంకా చెప్పాలి అంటే 144 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఉత్సవాన్ని మహాకుంభమేళా అంటారు. అందుచేత ఈ సందర్భంగా పుణ్యస్నానాలు చేయడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు నమ్మకం.