భారత దేశం గడ్డ మీద నక్సలిజం అధ్యాయం ముగిసినట్లే కనిపిస్తోంది. వరుస ఎన్ కౌంటర్ లతో నక్సలైట్ల పునాదులు కదులుతున్నాయి. 1,2 నెలల్లో మొత్తం తుడిచి పెట్టుకు పోవటం ఖాయం అనిపిస్తోంది.
1969లో శ్రీకాకుళం జిల్లాలో నక్సలిజం ఒక ఉద్యమంగా మొదలైంది.
కొనసాగింపుగా కొండపల్లి సీతారామయ్య వంటి నాయకుల ఆధ్వర్యంలో, ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ వంటి రూపాలు తీసుకుంది. ఒకప్పుడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసినా, ఇటీవల కాలంలో దాని ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. నక్సలిజం, మావోయిజం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన రాష్ట్రాల్లో ఏపీ ఉంటుంది.
ఉమ్మడి ఏపీలో ఎంతో మంది నేతలు నక్సల్స్ చేతుల్లో హతమయ్యారు. దుద్దిళ్ల శ్రీపాదరావు నుంచి కిడారి సర్వేశ్వరరావు, మాధవరెడ్డి వరకూ చాలా మంది ప్రజా నాయకులు అకారణంగా, కేవలం తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి చంపేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో క్లైమోర్ దాడి చేసి హతమార్చాలని చూశారు, విఫలమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై ప్రయత్నం చేశారు.
పోలీసు భద్రతా బలగాలను, అధికారులను ఎంత మందిని చంపారో లెక్కలేదు. ఇక సైద్ధాంతికంగా వారి ఉనికిని ప్రశ్నించిన ఆర్ఎస్ఎస్, ఎబివిపి, బీజేపీ తదితర సంస్థల నేతలను సహితం హతమార్చారు. అయితే తర్వాత మావోయిస్టుల ప్రభావం క్రమేపి తగ్గిపోయింది. ఏవోబీలో మాత్రమే అంతంతమాత్రం ఉండేవారు. ఆపరేషన్ కగార్ ను క్లైమాక్స్ కు తీసుకు వచ్చాక చివరి ఘట్టం ఏపీలోనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మావోయిస్టుల భావజాలం గురించి పక్కన పెడితే ప్రస్తుత కాలంలో వారి పోరాట విధానమే అసహజంగా మారింది. ఎక్కడ ఉన్నా మనిషిని ఇట్టే కనిపెట్టగలిగే టెక్నాలజీ వచ్చింది. వీరు అడవుల్లో కి వెళ్లినప్పుడు కనీసం సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. ఆ సమయంలో ఆ నక్సల్స్ మైదాన ప్రాంతాల్లో యథేచ్చగా తిరిగినా గుర్తు పట్టేవారు ఉండరు. కానీ ఇప్పుడు అలా లేదు.
మొత్తం బహిరంగం అయిపోయింది. అంతకు మించి భావజాలం బలహీనపడిపోయింది. అంతర్గత సమస్యలతో చీలికలు పేలికలు అయి పోలీసులకు సమాచారం ఇచ్చేవారు ఎక్కువయ్యారు. ప్రభుత్వం కూడా నక్సల్స్ సమస్యను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అందుకే లొంగిపోయిన వాళ్లు లొంగిపోగ, మిగిలిన వాళ్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు లీడర్, క్యాడర్ ఎవరూ లేరు.
మావోయిస్టులకు బహిరంగంగా కొంత మంది మద్దతు పలుకుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చెప్పినట్లుగా వీరు మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో దందాలు చేసుకుంటూ విలాసవంతమైన జీవనం గడుపుతున్నారు. యువతను రెచ్చగొడుతున్నారు. కానీ తమ కుటుంభం సభ్యులు ఎవ్వరినీ అడవులకు పంపిన దాఖలాలు లేవు.
ఇలాంటి వారంతా హిడ్మా ఉన్నంత కాలం మావోయిస్టు పార్టీ ఎప్పటికైనా తిరిగి పుంజుకొంటుందని చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ హిడ్మా లేరు. మావోయిస్టు పార్టీకి ఇప్పుడు లీడర్ గా భావిస్తున్న దేవ్ జీ ఆచూకీ తెలియడంలేదు. పోలీసుల వద్దే ఉన్నారని ఈ సానుభూతి పరులు అంటున్నారు. ఈ నక్సలిజం అనేది గతంలో అన్ని పార్టీల రాజకీయ నేతలు, దోచుకునే వ్యాపారస్తుల దోపిడీకి, కబ్జాలకు, ఆర్ధిక నేరాలకు కొన్నేళ్ల పాటు అడ్డుకట్ట వేయగల్గిన మాట.
మొత్తం మీద పరిస్థితులు మారుతున్నాయి.
ఎంతో భయంతో దాక్కుని తిరిగిన మాట అయితే వాస్తవం, యదార్థం.. ఇప్పుడు ఆ భయం రాజకీయ నేతలకు, దోపిడీదారులకు ఇక లేదు… యధేశ్ఛగా వీరి కార్యకలాపాలు కొనసాగించే అవకాశం “ఆపరేషన్ కగార్” కల్పించేసింది. వచ్చే ఏడాది మార్చి31 వరకు కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. కానీ దళాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. చివిరికి దేవ్ జీ కూడా దొరికిపోయారని చెబుతున్నారు.
చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలోనే వీరు ఉండలేక విజయవాడ, ఏలూరు తదితర మైదాన ప్రాంతాలకు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారంటే. వీరికి ఎక్కడా బతుకు లేదని అర్థం. మిగిలిపోయిన మావోయిస్టులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే ఉంటారు. వారందర్నీ కూడా లొంగిపోయేలా చేయడమో, లేకపోతే వేరే మార్గమో చూసి తెలుగు నేలపైనే ప్రారంభమైన నక్సలిజం తెలుగునేలపైనే అంతం అనే ప్రకటన చేసినా ఆశ్చర్యం ఉండదు.



