తెలుగు గడ్డమీద భారతీయ జనతా పార్టీ అంతకంతకు బలపడుతుంది. గడచిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో సాదాసీదాగా ప్రభావం చూపించింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని బలమైన పంజా విసిరింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీకి బాగా బూస్ట్ ఇచ్చాయి.
తెలంగాణ లో రెండు చోట్ల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కమలం పార్టీకి ఊపును తీసుకుని వచ్చాయి. ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపు సాధించడం విశేషం. ఇంకా చెప్పాలంటే అన్ని సీట్లలోనూ బిజెపి లేదా బిజెపి మద్దతిచ్చిన అభ్యర్థులే గెలుపొందారు.
టీచర్ ఎమ్మెల్సీ సీటుని మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ ని గెలుచుకోవడంతో కమలం నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ఇద్దరు బీజేపీ అభ్యర్ధులు, ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఎన్డీయే అభ్యర్ధులు విజయం సాధించారు. వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఎన్డీయే కూటమికి, బీజేపీకి అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధుల విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు. దాన్ని ప్రధానమంత్రి రీట్వీట్ చేశారు. ఏపీ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని హామీ ఇచ్చారు.
స్థానిక నాయకులు, కార్యకర్తలు అయితే పండగ చేసుకుంటున్నారు. బిజెపికి కొత్త ఊపు వచ్చేసిందని, ఈ దూకుడుని ఎవరు ఆపలేరని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున,, అక్కడ కూడా కాషాయ జెండాను ఎగరవేస్తామని కార్యకర్తలు నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ మీద బిజెపి జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఇతర నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో పట్టు సాధించాలని కమలనాథులు భావిస్తున్నారు.