మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయ విహారం చేసింది. ప్రత్యర్థులకు అక్షరాలా చుక్కలు చూపించింది.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. సుమారు 230 సీట్లు గెలుచుకొంది. మహాయుతి కూటమి ఇంతటి ప్రభంజనం సృష్టించడం వెనుక చాలానే కారణాలున్నాయి.
కమల నాథుల ప్రణాళిక బాగా ఫలించింది. ఈ సారి ఎలాగైనా విజయం అందుకోవాలని అధికార బీజేపీ.. పార్టీలతో కూటమి కట్టింది. ఎన్నికలకు ముందే రకరకాల సంక్షేమ పథకాలు ప్రారంభించింది. ఓబీసీ ఓట్ల సమీకరణపై ప్రధానంగా దృష్టిసారించారు. ఓబీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్న ప్రచారంతో.. వ్యూహాలను అమలు చేశారు. ప్రతిపక్ష శిబిరం మరాఠా రిజర్వేషన్లను ప్రధాన అస్త్రంగా తీసుకున్నా.. మహాయుతి ముఖ్యనేతగా సీఎం షిండే ఉన్నా.. ఓబీసీలు మాత్రం బీజేపీ నేతృత్వంలోని కూటమి వైపే మొగ్గు చూపారు.
ఇక 11 జిల్లాల విదర్బ ప్రాంతంలో ఈ సారి బీజేపీ అద్భుతమైన ప్రభావం చూపింది. 62 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దాదాపు 40 కి పైగా స్థానాల్లో ప్రభావం చూపించింది. ఈ ప్రాంతంలోనే నాగ్ పూర్ ఉండటం.. ఆర్ఎస్ఎస్ ప్రభావం చూపడంతో.. మహాయుతి ఎక్కువ స్థానాల్లో పాగా వేసింది. ఇక ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన లడ్కీ బెహన్ పథకం.. మహిళా ఓట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో మహిళ ఖాతాలో రూ.1500 ఇస్తుండగా.. ఎన్నికల తర్వాత రూ.2100 ఇస్తామని ప్రకటించింది. ప్రతిపక్ష కూటమి మహిళలకు రూ.3000 ఇస్తామని ప్రకటించినా.. మహిళలు నమ్మలేదని తెలుస్తోంది. అలాగే రైతులకు.. కిసాన్ సమ్మాన్ పథకం కూడా ప్రభావం చూపింది. రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతామని ప్రకటించింది. ఇలా అన్ని వర్గాలను తమవైపు తిప్పుకోవడంలో మహాయుతి కూటమి విజయం సాధించింది.
జాతీయ అంశాలు కూడా బాగా కలిసి వచ్చాయి.
ప్రధాని మోడీ చరిష్మా, డబుల్ ఇంజిన్ సర్కార్, అయోధ్య రామ మందిరం వంటి జాతీయ అంశాలను కూడా ప్రభావం చూపాయి. బాటేంగేతో కాటేంగే అన్న నినాదం.. భారీగా పనిచేసిందని చెబుతున్నారు. అలాగే స్థానిక సమస్యలను కూడా ప్రచారంలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులకు మద్దతు ధర.. ఇలా.. రకరకాల అంశాలపై స్పష్టమైన హామీలు పని చేశాయి.
మొత్తం మీద బలమైన మహారాష్ట్ర లో గెలుపు తో బీజేపీ లో హర్షం వ్యక్తమవుతోంది.