హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ జానపద పండుగలో అనేక దేశాలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమం విశేషాలను కేంద్ర మంత్రి మరియు లోక్ మంథన్ స్వాగత కమిటీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ప్రజ్ఞ వాహిని కన్వీనర్ నంద కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
లోక్ మంథన్ అనేక సంవత్సరాలుగా ప్రతి రెండేళ్లకొకసారి దేశానికి సంబంధించి, దేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి, దేశ ప్రజల జీవన విధానానికి సంబంధించి ప్రపంచంలోని ప్రముఖులను పిలిచి చర్చించి ఒక ఆలోచనా మథనం చేసే ఒక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు., ఈ ఏడాది హైదరాబాదులోని శిల్పకళావేదిక (శిల్పారామం)లో 4 రోజుల పాటు నవంబర్ 21 నుంచి 24 వరకూ జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జాతీయ భావజాలం గలవారు, వందలాది కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, కవులు, కళాకారులు, విదేశాల నుంచి కూడా పలువురు ప్రతినిధులు సహా అన్ని వర్గాలవారు పాల్గొంటారని, సాగర మథనం జరిగినట్టుగా నేటి సమస్యలపై సెమినార్లు, కళా ప్రదర్శనల ద్వారా లోక్ మంథన్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ మహోత్సవంలో అడవులు, గిరులలో నివసించే వనవాసీలు, మైదాన ప్రాంతాల్లో జీవించే బంజారాల వంటి అందరూ పాల్గొంటారని తెలిజేస్తూ వనవాసి, గ్రామవాసి, నగరవాసి… అందరూ కలిస్తేనే భారత్ వాసి అవుతామని లోక్‌మంథన్ ఉద్దేశ్యాన్ని వివరించారు.
ఇక్కడ ఏర్పాటు చేసే స్టాల్స్‌లో అనేక ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, ప్రజలకు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఉంటుందన్నారు. వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, 1000 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల బస్తీ ప్రజలు, గిరిజనులు, ఐటీ రంగం సహా అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చేలా అందరినీ అహ్వానిస్తున్నామని, కనీసం లక్షలాది మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. లోక్‌మంథన్ వేడుకలు గతంలో భోపాల్, రాంచీ, గౌహతిలోనూ జరిగాయని తెలిపారు . హైదరాబాదు లోక్‌మంథన్ వేడుకకు సంబంధించి నవంబర్ 21న ప్రతినిథుల నమోదు కార్యక్రమం, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ద్వారా ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారని, 22న లోక్‌మంథన్ కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని మీడియా ప్రతినిధులకు తెలిపారు.
లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె.నందకుమార్ మాట్లాడుతూ “లోక్” అంటే ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన మాట కాదని, అది మన దేశపు ప్రాథమిక సంస్కృతికి సంబంధించినదని అన్నారు. వేర్వేరు సంస్కృతులు ఉన్నప్పటికీ అంతర్గతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న భారతదేశంలో నేడు కొన్ని శక్తులు ప్రజల్లో చీలికలు తెచ్చి విద్వేష భావాన్ని నింపుతున్నాయని, అందువల్ల మరొకసారి ఏకత్వాన్ని చాటిచెప్పాల్సిన అవసరముందని అన్నారు. ఇప్పటికీ వలసపాలన ప్రభావంలోనే ఉన్న మన భావజాలాన్ని దాని నుంచి విముక్తి చెయ్యడం తొలి బాధ్యతగా ఉందంటూ లోక్‌మంథన్ వేదికగా మేధావులు, కార్యాచరణశీలురు కలసి ఈ దిశగా కృషి చేస్తారని తెలిపారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్‌తో పాటు ఆచార్య మిథిలేష్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా వివిధ రంగాల ప్రముఖులు విచ్చేస్తున్న హైదరాబాద్ లోక్‌మంథన్‌కు ప్రతి ఒక్కరూ విచ్చేసి భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అనుభవించి, ఆస్వాదించాలని కోరారు. లోక్‌మంథన్ ఉత్సవం జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పించేందుకు సంబంధిత శాఖ అంగీకారం తెలిపిందని నందకుమార్ వివరించారు.