ఏపీలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి అధికారమే లక్ష్యంగా ప్రధానపార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇక ఈసారి పవర్లోకి రాకుంటే పార్టీ ఉనికే ప్రమాదం అనే స్థితిలో ఉన్న టీడీపీ మరింత దూకుడు పెంచింది. లోకేష్ పాదయాత్రకు పార్టీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే నారా లోకేశ్ ను నేరుగం రంగంలోకి దింపుతోంది పార్టీ.
2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. సొంతజిల్లా చిత్తూరులోని తండ్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. ఏడాదిపాటు యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వ తీరును ఎండగడుతూ లోకేశ్ యాత్ర సాగనుంది.