పార్లమెంటు సమావేశాల్లో పార్టీల వారీగా సీట్లను మారుస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కొన్ని గమ్మతైన విషయాలు చోటు చేసుకొన్నాయి. ఇప్పుడు అవే అంశాలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. సాంప్రదాయం ప్రకారం స్పీకర్ కు పూర్తిగా కుడివైపున మొదటి సీటు ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి కేటాయించారు. ఆయనకు పక్కనే మంత్రి వర్గంలో అత్యంత సీనియర్ అయిన రాజ్ నాథ్ సింగ్ కు నిర్దేశించారు. తర్వాత మూడో నెంబర్ సీట్ ను అమిత్ షా కు, నాలుగో నెంబర్ సీట్ ను నితిన్ గడ్కారీ కి ఏర్పాటు చేశారు. మొదటి వరుస లోని ఆ తర్వాత సీట్లను సీనియర్ మంత్రులు అయిన నిర్మలా సీతారామన్ కు, జై శంకర్ కు, జేపీ నడ్డాకు రిజర్వ్ చేశారు. అదే క్రమంలో మొదటి వరుసలోనే తెలుగుదేశం పార్టీ మంత్రి రామ్మోహన్ నాయుడు, జేడీయూ మంత్రి రాజీవ్ రంజన్ కు కేటాయించారు. ఇక ఎడమ వైపున మొట్ట మొదటి స్థానాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి కేటాయించారు. ఆయన పక్కన కూర్చొనే అవకాశం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు ఇచ్చారు. డీఎంకే పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు టీ ఆర్ బాలు, ఏ రాజా కు మొదటి వరుస సీట్లను కేటాయించారు. తర్వాత సీట్లను సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, తృణమూల్ నాయకుడు సుదీప్ బంధోపాధ్యాయ కు ఏర్పాటు చేశారు.
మొత్తం మీద పార్లమెంటు లో సీట్లను ఎనిమిది బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకు లోనూ 12 వరుసల్లో ఎంపీలకు సీట్లను సీనియారిటీ ప్రాతిపదికన కేటాయించారు. ప్రతీ బ్లాకు కు మొదటి వరుసలో ఆయా పార్టీల పార్లమెంటరీ నాయకులు కూర్చొనే ఏర్పాటు చేశారు. ఇందులో కుడివైపు ఉండే అయిదు బ్లాకులను అధికార ఎన్డీయే కూటమికి ఇచ్చారు. ఎడమ వైపు నుంచి ఉండే మూడు బ్లాకులను ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చారు.
ఈ కొత్త సీటింగ్ లో గమ్మతైన ట్విస్ట్ ఏమిటంటే సంఖ్యా బలం కారణంగా తెలుగుదేశం, వైసీపీ ఎంపీల సీట్లను చాలా దగ్గరగా ఏర్పాటు చేశారు. టీడీపీ లోక్ సభ నాయకుడు లావు క్రిష్ణ దేవరాయలు, వైసీపీ లోక్ సభ నాయకుడు మిథున్ రెడ్డి చాలా సన్నిహితంగా కూర్చోవాల్సి రావటం గమ్మతైన విషయం.
ఇక, సమాజ్ వాదీ పార్టీ తరపున ఉప నాయకుడుగా బాగా ప్రచారం పొందిన అయోధ్య దళిత ఎంపీ అవధీశ్ ప్రసాద్ కు ఆ పార్టీ ఎటువంటి హోదా ఇవ్వలేదు. దీంతో ఆయన సీటును బాగా వెనక్కి పంపించేసి, 357వ సీటును కేటాయించారు.
అటు, కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీకి ఎటువంటి పదవి ఇవ్వని కారణంగా, ఆమె కు నాలుగో వరుస లోని 517 వ సీటును కేటాయించారు.
మొత్తం మీద ఈ సీట్ల కేటాయింపు మీద కొన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.