‘ఆధార్-ఓటర్’ ఐడీని లింక్ చేసే ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లు 2021, సోమవారం మధ్యాహ్నం లోక్ సభ ఆమోదించింది. తప్పుడు ఓట్లను తొలగించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం.
అయితే ఈ సవరణ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పాన్-ఆధార్ లింక్ చేసినట్లుగానే ఓటర్ లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేయనున్నారు. ఓటింగ్ ప్రక్రియను మెరుగుపరచడం, ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఎలక్షన్ కమిషన్ కు మరికొన్ని అధికారాలు కల్పించడమే లక్ష్యం గా కేంద్రం ఇటీవల ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది.
అలాగే ప్రతియేటా జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయితే ఓటర్ కార్డు నమోదుకు అనుమతించనున్నారు. ఏడాదిలో నాలుగు సార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించే మరో ప్రతిపాదన కు కేంద్రం ఓకే చెప్పింది.