భారత దేశంలో చైనా తరపున లాబీయింగ్ నడుస్తోంది. ఇక్కడ చైనా పెట్టుబడులు పెంచాలన్న డిమాండ్ ను తెర మీదకు తెస్తున్నారు. ఇందుకోసం ఆర్థిక శాస్త్రంలోని చాలా లెక్కలు బయట పెడుతున్నారు.
చైనా పెట్టుబడులు తగ్గటానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. 2020 లో భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం మొదలైనప్పటి నుంచి ప్రెస్ నోట్ -3 అమల్లో ఉంది. దీని ప్రకారం భారతదేశంతో భూ సరిహద్దులు ఉన్న దేశాల నుండి పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ అనుమతిని పొందడం తప్పనిసరి. ఫలితంగా ఎగుమతులు ఊపందుకున్నప్పటికీ ఈ నియంత్రణ తర్వాత చైనా నుంచి పెట్టుబడులు తగ్గిపోయాయి.
చైనా నుంచి పెట్టుబడుల విధానాన్ని సడలించాలని కొన్ని వర్గాలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా చైనా ప్లాంట్లు, పరికరాలను ఉపయోగించే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చైనా పెట్టుబడులు రాకపోవడం వల్ల దేశ సొంత తయారీ రంగంపై ప్రభావం పడుతోందని ఆయన కంపెనీలు చెబుతున్నాయి.
గత వారం విడుదల చేసిన ఒక ఆర్ధిక సర్వే లో చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
అయితే, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే దేశీయ సంస్థలకు నష్టం కలగొచ్చు అన్న వాదనలు కూడా ఉన్నాయి. ‘మేకిన్ ఇండియా’కు చైనా కంపెనీలను అనుమతించడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉంది., కీలకమైన సరఫరాలు, ఆర్థిక వృద్ధి కోసం దేశీయ సంస్థలు చైనా కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనా పెట్టుబడి పెట్టిన ఏ దేశమూ బాగుపడటం చరిత్రలో లేదు. పెట్టుబడిల పేరుతో అక్కడ ఆర్థిక వ్యవస్థలో తిష్ట వేయడం చైనాకు బాగా అలవాటు. తెలిసి తెలిసి చైనాతో సంబంధాలు పెట్టుకోవడం ఆర్థికంగానే కాకుండా భద్రతాపరంగా కూడా తలనొప్పి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.