భారత దేశాన్ని రత్న గర్భ అనేవారు.. వందలఏళ్లు దేశాన్ని పాలించిన విదేశీయులు అపార సంపదను కొల్లగొట్టారు. అయితే ఈ నేలమీద ఎన్నటికీ తరగని సంపద ఉందని…ఎప్పటికీ ఈనేల రత్నగర్భేనని రుజువు చేస్తూ అత్యంత ఖరీదైన నిక్షేపాలు వెలుగుచూశాయి. జమ్ముకశ్మీర్లో దాదాపు 59 లక్షల టన్నుల వరకు ఖరీదైన లిథియం నాన్ ఫెర్రస్ లోహం ఉన్నట్టు గుర్తించినట్టు కేంద్రం ప్రకటించింది. జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో మొట్టమొదటిసారి అత్యంత అరుదైన లిథియం నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాలు జమ్మూ-కశ్మీర్లోని రియాసీ జిల్లా, సలాల్-హైమన ప్రాంతంలో ఉన్నాయి.ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీ తయారీలో ఈ లిథియంను వినియోగిస్తారు. బిగ్ బ్యాంగ్ నుంచి లభించే ఏకైక లోహం ఇది. నీటితో చేరితే మండే ఈ లోహం అత్యంత తేలికైనది కూడా. ఇంకా సెరామిక్స్ అంటే పింగాణి, గాజు, గ్రీజులు, ఫార్మాస్యుటికల్ కాంపౌండ్స్, ఎయిర్ కండిషనర్స్, అల్యూమినియం ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.
ఇక అత్యధిక ఇంధన నిల్వ సామర్థ్యం ఉన్నందున బ్యాటరీ మెటీరియల్స్ మార్కెట్లో దీనిదే పై చేయి. తక్కువ సాంద్రతగల లోహం కావడమే దీనికి కారణం. టెస్లా కారు 600 కేజీల లిథియం బ్యాటరీతో నడవగలదు. అదే లెడ్-యాసిడ్ బ్యాటరీని ఉపయోగిస్తే, 4,000 కేజీల బరువుగల లెడ్-యాసిడ్ బ్యాటరీ అవసరమవుతుంది.లెడ్-యాసిడ్ బ్యాటరీలా కాకుండా లిథియం-అయాన్ బ్యాటరీలను 10 శాతం కెపాసిటీతో డిశ్చార్జ్ చేయవచ్చు.