జమ్ము కాశ్మీర్ లో శాంతిభద్రతలు అదుపు చేసేందుకు పవర్ ఫుల్ అధికారిని పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన నళిని ప్రభాత్ ను జమ్మూ కాశ్మీర్ కొత్త డిజిపిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత డిజిపి పదవీకాలం పూర్తయిన వెంటనే నళినీ ప్రభాత్ ఛార్జ్ తీసుకుంటారు.
జమ్ము కాశ్మీర్ డీజీపీ పదవిలో
ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారని కేంద్రం పేర్కొంది. 1992 బ్యాచ్ ఐపీఎస్ నళీని ప్రభాత్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల ఎస్పీగానే కాకుండా గ్రేహౌండ్స్‌లో సైతం పని చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు ఆయన అవలంభించిన విధి విధానాల పట్ల కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపించింది.
తీవ్రవాదులు ఉగ్రవాదులను హ్యాండిల్ చేయడంలో నళినీ ప్రభాత్ దిట్ట. అల్లర్లను అణిచివేయడంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తారు. ప్రజల శాంతిభద్రతలకు పెద్ద పీట వేయటం ఆయనకు అలవాటు. పలు పోలీస్ పతకాలను సైతం నళిన్ ప్రభాత్ అందుకున్నారు. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్‌గా ఆయన కొనసాగుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన నళిన్ ప్రభాత్‌ను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌లో మూడేళ్లు పని చేసేందుకు అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) బుధవారం నిర్ణయించింది.
రెండు నెలల క్రితం ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి జమ్మూ కశ్మీర్లో వరుసగా ఉగ్రదాడులు ఊపందుకున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడుల్లో భారత సైన్యానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, సైనికులు మృతి చెందుతున్నారు.
అలాంటి వేళ రాష్ట్రంలో ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఆ రాష్ట్రంలోని ఉన్నత అధికారులతో అమిత్ షా భేటీ నిర్వహించారు. ఆ క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. దీంతో ఉగ్రవాద చర్యలు నిర్మూలనకు కఠిన చర్యలు అవలంభించాలని ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ ఉన్నతాధికారులకు అమిత్ షా ఆదేశించారు.
ఈ క్రమం లోనే నళిని ప్రభాత్ ను డీజీపీగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను పూర్తిస్థాయిలో ఎరువేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు తగినట్లుగా పూర్తిస్థాయి అధికారాలు అప్పగించి నళినీ ప్రభాత్ ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.