భాషల మీద నెలకున్న వివాదానికి కేంద్రం తెర దించింది. హిందీ భాషను రుద్దే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని భాషలను గౌరవిస్తామని, ప్రతీ భాషను జాతీయ భాషగానే చూద్దామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రతి భాషా భారతీయ జ్ఞానానికి ఓ వారధి అని అభివర్ణించారు.
భాషల పేరుతో విభేదాలు తీసుకొని రావద్దని ధర్మేంద్ర ప్రధాన్ హితవు పలికారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన స్వదేశీ జ్ఞాన వ్యవస్థలు మరియు సుస్థిర అభివృద్ధిపై అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడారు.సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక విద్య మరియు స్థిరమైన అభివృద్ధి పద్ధతులలో అనుసంధానించాలని పిలుపునిచ్చారు. భారతీయ మేధో వారసత్వాన్ని సమకాలీన విద్య, మరియు పరిశోధన చట్రాలకు అనుసంధానించి, సమగ్ర పరచాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వున్న పలువురు మేధావుల పరిశోధనా పత్రాల సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతీ జ్ఞాన వ్యవస్థల పాత్రను నొక్కి చెప్పారు. భాషల పరిరక్షణకు తమ ప్రభుత్వం నిబద్ధతతో కట్టుబడి వుందని ప్రకటించారు.మనమంతా భారతీయులం అనీ, భారతీయ తత్వంతో నడుద్దామ్ అని ఆయన సూచించారు.
అఖిల భారత అధ్యాపకుల సంఘం జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ నారాయణ లాల్ గుప్తా అధ్యక్షోపన్యాసం చేశారు. స్వావలంబన, స్థిరమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రధాన స్రవంతి విద్యలో దేశీయ విద్యను చేర్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రొఫెసర్లు, విద్యావేత్తలు పాల్గొన్నారు.