మధ్యప్రదేశ్ లెజెండరీ టైగ్రెస్ కాలర్వాలీ కన్నుమూసింది. T15 గా పిలిచే 17 ఏళ్ల కాలర్వాలీ వృద్ధాప్యం కారణంగానే చనిపోయిందని రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ లో కాలర్వాలీ అంటే తెలియని వారుండరు. ముఖ్యంగా పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఆదరణ పొందిన పెద్దపులి కాలర్వాలీ. రికార్డు స్థాయిలో 29మంది పులికూనలకు జన్మనిచ్చింది ఈ పెద్దపులి. ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అసలైతే పులి సగటు వయసు 12 ఏళ్లు కానీ కాలర్వాలీ 17 బతికింది. ఇన్ని అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న కాలర్వాలీ బతికిన్నన్నాళ్లూ ఫారెస్టును రారాణిలా ఏలింది.
పులల జనాభాను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడ్డంలో టైగర్ వాలి కృషి అపారమైనది. 2005లో పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో T-7 కి పుట్టిన నాలుగు పిల్లల్లో కాలర్ వాలీ ఒకటి.
పదకొండేళ్లల్లో 8 ఈతల్లో 29 పులి కూనలకు జన్మనిచ్చింది కాలర్వాలీ. మే 2008లో మొదటిసారిగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ అవి బతకలేదు. 23 అక్టోబర్ 23న కాలర్ వాలీ కడుపున ఒకేసారి ఐదు పిల్లలు నాలుగు ఆడ, ఒక మగ పిల్ల పుట్టాయి. 2018 డిసెంబర్లో చివరి సారి నాలుగు పిల్లల్ని ప్రసవించింది.
సిబ్బందితో పాటు పర్యాటకులూ దీన్ని సూపర్ మామ్ గా పిలుచుకునేవారు. టూరిస్టులు ఎంతో ఇష్టపడేవారు.. టూరిస్టులనూ తాను అంతగా ఇష్టపడేది. టూరిస్టులు ఎవరైనా సఫారీకి వస్తుంటే జీప్ శబ్దం విని రోడ్డుపైకి వచ్చి వాళ్లకి కనిపించి వెళ్లేది. టూరిస్టులెవరికీ ఎలాంటి హానీ చేసేది కాదు. అందుకే కాలర్వాలీని టూరిస్ట్ లవర్ అనేవారు.
కాలర్ వాలీ సంతానోత్పత్తిని అధ్యయనం చేసేందుకు స్టేట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్త అనిరుధ్ మజుందార్ దాన్ని ఏడేళ్లు ట్రాక్ చేశారు. ఒక పులి ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనిచ్చిన దాఖలాలు లేవని…అందుకే కాలర్వాలీ సూపర్ మామ్ అని ఆయన అన్నారు.
29 పులిపిల్లలకు జన్మనిచ్చి దేశంలోని పులుల సంరక్షణకు కాలర్వాలీ చేసిన ప్రయత్నం ఎంతో గొప్పదని జంతుప్రేమికులు, పర్యావరణ వేత్తలు గుర్తు చేసుకున్నారు. 2008లో మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల జనాభా అంతరించిపోవడంతో…అక్కడ పులుల జనాభాను పునరుద్ధరించేందుకు కాలర్వాలీ పిల్లల్లో ఒక ఆడపులిని పన్నాకు పంపించారు.
జనవరి 14న చివరి సారి భురా దేవ్ నుల్లా సమీపంలో పడుకుని ఉండగా గుర్తించామని.. వృద్ధాప్యం కారణంగా చాలా బలహీనంగా కనిపించిందని.. కదల్లేని స్థితిలో ఉన్నదానికి వైద్యులు చికిత్స కూడా అందించారని..అయినా లాభం లేకపోయిందని.. అదేరోజు సాయంత్రం కాలర్వాలీ చనిపోయిందని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఫీల్డ్ డైరోక్టర్ తెలిపారు. కాలర్వాలీకి పోస్టు మార్టం నిర్వహించారు కానీ ఇంకా రిపోర్ట్ రావల్సి ఉంది. వృద్ధాప్యమే తన చావుకు కారణమని ప్రాథమికంగా వైద్యులు, అధికారులు నిర్థారించారు.
ఆదివారం రిజర్వు ఫారెస్టులో జరిగిన కాలర్వాలీ అంత్యక్రియలకు ఫారెస్ట్ సిబ్బంది సహా పలువురు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.