తెలంగాణలో గురుకుల విద్యాలయాల సొసైటీకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఝలక్ ఇచ్చింది. లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. లాక్డౌన్ నిబంధనలను గాలికి వదిలేసి.. గురుకులాకు చెందిన విద్యార్ధినులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారని పేర్కొంది. నగర సమీపంలోని మొయినాబాద్‌లో ఉన్న ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 300 మంది విద్యార్ధినులను ఉంచారని ఫిర్యాదులో పేర్కొంది. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్..ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కమిషన్ సభ్యులు ఆనంద్ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో.. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చెప్పినట్లుగానే ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజీలో 300 పైగా విద్యార్థినులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే దీనిపై వివరణ కోరుతూ కమిషన్ చైర్ పర్సన్ ప్రియాంక్ కానుంగో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యాలయాలను మూసేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను స్పష్టంగా ఉల్లంఘించినట్లు కమిషన్ సభ్యులు పేర్కొన్నారు.
కమిషన్ జారీ చేసిన నోటీసులోని ముఖ్యాంశాలు
1. ఇంతకు ఆజాద్ కాలేజీ వివరాలు ఏంటి..? మేనేజ్మెంట్ ఎవరు..? ట్రస్టీలు ఎవరు..? ఆ కాలేజీ విధివిధానాలు ఏమిటి?
2. ఆజాద్ కాలేజీలో రహస్యంగా ఉంచిన విద్యార్థుల వయసు, ప్రాంతం పూర్తి వివరాలు ఏంటి..?
3. అసలు కాలేజీలో ఏ ప్రాతిపదికన విద్యార్ధులను అక్కడ చేర్చుకోవడం జరిగింది..?
4. ఇంతకు ఆ విద్యార్థులను అక్కడ ఉంచిన వ్యక్తులు ఎవరు..? ఆ విద్యార్ధులను ఎలా తీసుకువచ్చారు?
5. ఆజాద్ కాలేజీలో ఉండేందుకు విద్యార్థులకు ఎలాంటి ఫీజులైనా కాలేజీకి చెల్లిస్తున్నారా? ఒకవేళ చెల్లించకపోతే వారికి అంత మొత్తంలో నిధులు ఏ సంస్థ నుండి వస్తున్నాయి? ఎవరెవరు ఇస్తున్నారు?
6. రెసిడెన్షియల్ స్టూడెంట్స్ ని ఉంచడానికి విద్యా సంస్థలకు, హాస్టళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలు ఏంటి..?
7. ఈ సంఘటనకు సంబంధించి కరోనా నియమాలను ఉల్లంఘించిన దానికి బాధ్యులు ఎవరు..?వారి పూర్తి వివరాలు ఏమిటి!
పైన కోరిన వివరాలన్నింటిని పది రోజుల్లోగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు రిపోర్టులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే ఈ నోటీసు కాపీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌కు సోమేష్ కుమార్‌కు కూడా పంపించారు. దీంతో పాటు ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌కు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుంటే.. ఆజాద్ కాలేజీ యాజమాన్యంపై చర్యలకు పరిశీలించమంటూ అఖిల భారతీయ సాంకేతిక విద్యామండలికి కమిషన్ సూచించింది.