లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం తేవాల్సిందే.. వీహెచ్‌పీ డిమాండ్.
లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువతిపై షారూక్ అనే యువకుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తనను ప్రేమించాలంటూ వెంటపడుతుండటంతో.. బాధిత యువతి నిరాకరించడంతో.. నిందితుడు షారూక్ సదరు యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలు కేకలు విన్న వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని షారూక్‌ను అడ్డుకున్నారు. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే సదరు బాధిత యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాధిత యువతిని పరామర్శించేందుకు గురువారం నాడు వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు గారు, అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్‌లు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులను కలిసిన అధికారులు.. బాధిత యువతి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను కూడా కలిసిన అధికారులు.. అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వీహెచ్ప ప్రతినిధులు.. తెలంగాణలో లవ్‌జిహాద్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం లవ్‌జిహాద్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని.. ఇప్పటి వరకు అయిన ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. లవ్ జిహాద్ కుట్రలను ఛేధించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు తప్పిపోయిన అమ్మాయిల కేసులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని.. అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం వీహెచ్‌పీ డిమాండ్లకు స్పందించకపోతే.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి వీహెచ్‌పీ సిద్ధమవుతుందని హెచ్చరించారు.