మొదటినుంచి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో రెండు భారీ పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషి ఉన్నత యోజన పథకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ రెండు పథకాల కోసం సుమారు లక్ష కోట్ల దాకా వెచ్చించ బోతున్నారు.
ఈ పథకాల ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దేశంలో వ్యవసాయ స్వయం సమృద్థి స్థీరీకరణ, ఆహార భద్రతకు ఉద్దేశించారు. ఈ రెండు పథకాల అమలుకు మొత్తం వ్యయం రూ 1,01,321.61 కోట్లు అవుతుంది. వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలోని పలు స్కీమ్‌లను ఏకీకృత పథకం పరిధిలోకి తీసుకువచ్చి, వీటిని హేతుబద్థీకరించే నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు ప్రకటించాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తీపి కబురు అందింది.
దసరా , దీపావళి పర్వదినాల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ నిర్ణయానికి కూడా కేబినెట్ సమ్మతి తెలిపింది. ఉత్పాదన ఆధారిత బోనస్‌గా దీనిని 11.72 లక్షల మంది ఉద్యోగులకు అందుతుంది. దీనికి రూ.2028.57కోట్ల వ్యయం అవుతుంది.
ఇక రాబోయే ఆరేండ్లలో వంటనూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు కీలక పథకం నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ పథకం పరిధిలో రూ 10,103 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. వంటనూనెల దిగుతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి దిశలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో మరో ఐదు ప్రాంతీయ భాషలకు ప్రాచీన భాషల హోదా కల్పన కూడా కీలకం అయింది. మరాఠీ, బెంగాళీ, పాళి, ప్రకృతి, అస్సామీ భాషలను ఈ హోదాలోకి తీసుకువస్తున్నట్లు సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే దేశంలో తమిళం, తెలుగు , సంస్కృతం, కన్నడం, మలయాళం, ఓరియాలకు ఈ విశిష్ట ముద్ర ఉంది.
రైతులు చిన్న వ్యాపారులతో పాటు మధ్యతరగతి ఉద్యోగులకు మేలు కలిగేలా అనేక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.