హిందీ సినిమాల్లో విలక్షణంగా రాణిస్తున్న కిరణ్ రావు గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకున్నారు ఆమె రూపొందించిన సినిమాకు ఆస్కార్ అవకాశం దక్కింది. దీంతో బాలీవుడ్ వర్గాలలో ఆమె పేరు మార్మోగిపోతున్నది.
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ప్రోడక్షన్లో వచ్చిన చిత్రం ‘లాపతా లేడీస్’. ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
సినిమాలలో ఆమె కెరీర్ విచిత్రంగా సాగింది.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన కిరణ్‌రావు.. 2011లో అమీర్‌ఖాన్ హీరోగా ‘ధోభీ ఘాట్’ అనే చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత ‘లాపతా లేడీస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కథ కూడా గమ్మత్తుగా ఉంటుంది.
2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పల్లెటూరికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు తమ అత్తారింటికి వెళ్లే సమయంలో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైపోతారు. ఇది తెలియని పెళ్లికొడుకులు ఆ అమ్మాయిలను ఇంటికి తీసుకెళ్తారు. తీరా చూసుకున్నాక అసలు నిజం బయటపడుతుంది.
సినిమా కోసం టీమంతా బాగా కష్టపడ్డారు. జమ్తారా వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ మూవీలో హీరోగా నటించగా.. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నది. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఇది కాకుండా ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)’ అవార్డుల్లోనూ లాపతా లేడీస్ క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్‌గా అవార్డు అందుకుంది.
కొంతకాలంగా ఆస్కార్ మీద అంచనాలు పెరుగుతున్నాయి.
రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో కిరణ్‌రావు మాట్లాడుతూ.. తమ చిత్రం ఆస్కార్ వేదికపై మనదేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది తనతోపాటు చిత్ర బృందం కోరికని వెల్లడించారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తనవంతు బాధ్యతగా ఆస్కార్‌కు పంపిస్తుందనే నమ్మకం ఉన్నదనీ చెప్పుకొచ్చింది.
మొత్తానికి కిరణ్ రావు కలసాకారం అయ్యింది.