సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై బిజెపి మండిపడుతున్నాడు. దానితో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంటున్నది.. ఈ అంశంపై సోమవారం కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మధ్య ‘ట్విటర్ వార్’ జరిగింది.
కేటీఆర్ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ‘‘15 నిమిషాలపాటు పోలీసులను తొలగిస్తే సత్తా చూపిస్తామన్న ఎంఐఎం నేతల వ్యాఖ్య లు, నిజాం రజాకార్ ఆర్మీ హిందువుల ఊచకోత లాంటి అంశాలపై ఒవైసీ ని, ఎంఐఎంను కేసీఆర్, కేటీఆర్ సమర్థిస్తున్నట్లు అనిపిస్తోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం శ్రమిస్తున్న ప్రధానిని అవమానిస్తున్నారు’’ అంటూ ట్విటర్లో ఘాటుగా విమర్శించారు.
సమానత్వాన్ని బోధించిన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణను సైతం టీఆర్ఎస్ రాజకీయాలకు వాడుకోవడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. పాతబస్తీలోని అనేక వందల హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఎంఐఎం పార్టీకి మద్దతు గా నిలిచిన చరిత్ర టీఆర్ఎ్సదని అంటూ మండిపడ్డారు. ‘‘ఎంఐఎంకు మద్దతు పలికిన మీ రాజవంశ పాలన కలుషితమైందన్న విషయాన్ని.. ధర్మాలను ప్రబోధించేవారు గ్రహించాలి’’ అని హితవు చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపించిన వివక్షకు ఇదీ నిదర్శనమంటూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పసుపు బోర్డు, ఫార్మాసిటీ, కేఎంటీపీలకు నిధులు కేటాయించకపోవడం, ఐటీఐఆర్.. లాంటి 19అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని సవాల్ చేశారు.
‘‘ఐటీఐఆర్ ఇవ్వకున్నా దిగ్గజ ఐటీ కంపెనీలను తెచ్చుకున్నాం. జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా.. ప్రైవేటు కోచ్ ఫ్యాక్టరీ కట్టుకున్నాం. రాష్ట్రానికి అండగా మేము.. దేశానికి దండగ మీరు’’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా, కేటీఆర్‌పై బీజేపీ మాజీ ఎమ్మె ల్సీ ఎన్.రాంచందర్‌రావు ధ్వజమెత్తుతూ ‘‘సమతామూర్తి విగ్రహావిష్కరణ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగర్‌కు ఇదే చిరునామాగా మారింది. మీరు మద్దతు పలుకుతున్న వారి చార్మినార్ కాదు’’ అని ఎద్దేవా చేశారు.
మరోవంక, తెలంగాణపై కేంద్రం పక్షపాత వైఖరి అనుసరిస్తోందంటూ టీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులేమీ చేయలేదని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన రోజు నుంచి టీఆర్ఎస్ ఈ విమర్శల దాడిని ముమ్మరం చేసింది. వరుస ప్రెస్ మీట్లు, మంత్రుల ట్వీట్లన్నీ ఒకే తీరుగా కనిపిస్తుండటంతో.. ప్రగతిభవన్ నుంచే వీటిని ఆపరేట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపించని కొందరు మంత్రులు ట్వీట్లు పెట్టడాన్ని అందుకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. విభజన నాటి హామీలను ముందేసుకోవటం టీఆర్ఎస్కు అనుకూలించకపోగా రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తున్నది. ‘ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఆవిష్కరణ కోసం హైదరాబాద్‌కు ప్రధాని వచ్చిన రోజున ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ అంటూ సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ లీడర్లు వరుసగా పోస్టులు పెట్టారు.
ప్రధాని రక సందర్భంగా ఆ ఒక్కరోజే సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అయినట్లు మంత్రి కేటీఆర్ ఆఫీస్ ప్రకటించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల అమలులో ఫెయిలవడం వల్లే ఇప్పుడు కేంద్రంపై బాణాలు ఎక్కుపెట్టి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో అనేక స్కీమ్‌లు ముందుకు కదలడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతు రుణమాఫీ, దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, రెండో విడత గొర్రెల పంపిణీ.. ఇట్లా దాదాపు స్కీమ్‌లన్నీ అటకెక్కాయి. నాగార్జునసాగర్, హుజూరాబాద్ బై ఎన్నికల సమయంలో తప్ప.. మిగతా సందర్భాల్లో ఈ స్కీమ్‌లు అమలు కాకుండా ఆగిపోయాయి.
నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు, 57 ఏండ్లకు ఆసరా పెన్షన్, పోడు భూములకు పట్టాల పంపిణీ.. వంటి హామీలు మూడేండ్లుగా వాయిదా పడుతూనే ఉన్నాయి. తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కేసీఆర్, కేటీఆర్ నుండి అధికార పార్టీ నేతలు కేంద్రంపై అసందర్భపు ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
Courtesy :- NijamToday