ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం రేపుతోంది. అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పట్టణానికి చెందిన సాయిగణేశ్ పురుగుల మందు తాగి చనిపోయాడు. గురువారం పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ యశోదాకు తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూనే సాయి గణేశ్ కన్నుమూశాడు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని…దాంతో మనస్తాపానికి గురైబలవన్మరణానికి పాల్పడ్డాడని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాయి గణేశ్ స్థానిక ముత్యాలమ్మ గుడి సెంటర్లో శిలువ నిర్మాణాన్ని అడ్డుకున్నాడని…దీంతో ప్రత్యర్థులు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. అటు పోలీసులూ అక్రమకేసులతో వేధించేవారని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
అయితే సాయిగణేశ్ మృతి నేపథ్యంలో ఖమ్మంలో ఉద్రిక్తం నెలకొంది. పెద్దసంఖ్యలో ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు మంత్రి పువ్వాడ అజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోస్టుమార్టం చేయడంలో ఎందుకు ఆలస్యం అని నిలదీస్తూ డెడ్ బాడీని తరలించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకుని వారిని వారించారు. అటు బీజేపీ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో మంత్రి పువ్వాడ ఇల్లు, ఆఫీసు, పార్టీ కార్యలయం దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.