పంజాబ్ ఎన్నికల్లో విధ్వంస రచనకు ఐఎస్ఐ కుట్రచేస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ద్వారా అల్లకల్లోలం రేపాలని అది భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నిఘావర్గాల హెచ్చరికల్ని నిజం చేస్తూ… ఆయుధాలు, పేలుడు పదార్థాలు పడేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు శత్రువులు. అది భద్రతా ఏజెన్సీలకూ సవాలుగా మారింది. పంజాబ్ లోని భారత్ -పాక్ సరిహద్దులో డ్రోన్ లను గుర్తించిన సందర్భాలు 60కి పైనే. ఇక సరిహద్దు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను అవకాశంగా దేశంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ఐఎస్ఐస్ తీవ్ర కుయత్నాలే చేస్తోంది.దీంతో ఖలిస్తానీ ఉగ్రమూకల కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ తో పాటు…యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకూ సూచించాయి నిఘావర్గాలు.
IANS నివేదిక ప్రకారం, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI …తన ఉగ్ర సంస్థలను క్రియాశీలం చేస్తోంది. అందుకు ఎన్నికలు జరుగుతున్న ఈ సమయమే సరైందని భావిస్తోంది. అందుకోసం పంజాబ్ లోని తన టెర్రర్ మాడ్యూల్ లను ఉపయోగించి ఖలిస్తానీ వేర్పాటు వాద గ్రూపుల్ని రెచ్చగొడుతోంది. ఎన్నికలు జరుగుతున్న మరో రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర యూపీలోని కొన్ని ప్రాంతాలనూ అందుకు ఎంచుకున్నట్టు తెలిసింది. పంజాబ్ , యూపీ తో పాటు ఉత్తరాఖండ్ లో ఎన్నికల ర్యాలీలు లక్ష్యంగా వీవీఐపీలు, ప్రముఖ నాయకుల హత్యకూ కుట్ర జరుగుతోందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో ఏకంగా దేశ ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. అడ్డుకున్నది తామేనంటూ సిక్స్ ఫర్ జస్టిస్ ప్రకటించింది కూడా. ఖలిస్తానీ ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయడం ద్వారా దేశంలో అల్లర్లు రేపాలని చూస్తున్న ఐఎస్ఐ అందుకు రాష్ట్రంలో జరిగే ఎన్నికలే అవకాశంగా చూస్తోంది.అందుకు పంజాబ్ తో పాటు సిక్కు ఓటర్లు అధికంగా ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుంది.
With an aim to derail the electioneering process in the state & to increase the Khalistani footprints in #Punjab, the #Pakistan's ISI has activated its terror outfits to execute more terror activities in the state & also in some parts of UP, the Intelligence agencies have warned. pic.twitter.com/bRctGigwgS
— IANS (@ians_india) January 16, 2022
ఈ ఎన్నికలను పూర్తిగా నిర్వీర్యం చేయడంకోసం అనేక టెర్రర్ గ్రూపులను తిరిగి యాక్టివేట్ చేస్తోంది ఐఎస్ఐ. ఆ కుట్రల్ని బట్టబయలు చేస్తూ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో కో ఆర్డినేట్ చేసుకుంటున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని సిక్కు కమ్యూనిటీ మద్దతు పొందేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని , ఉగ్ర కార్యకలాపాలపై నిఘా పెట్టాలని హెచ్చరిస్తూ వస్తున్నాయి.ఎప్పటికప్పుడు సిక్కు మత పెద్దలు, సిక్కు ప్రముఖులతో టచ్ లో ఉంటూ వారిని అప్రమత్తం చేయాలని సూచిస్తున్నాయి.
ముఖ్యంగా అంతర్జాతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ (ISYF), బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI), ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (KCF) మరియు సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సహా ఇంకా పలు సిక్కు ఉగ్రవాద సంస్థలు భద్రతా సంస్థల రాడార్‌లో ఉన్నాయి. ఆయా సంస్థలతో టచ్ లోకి వెళ్లిన ఐఎస్ఐ …తమ పాకిస్తాన్ హ్యాండర్ల ద్వారా పంజాబ్ లోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేయాలని ఆదేశించినట్టు నిఘావర్గాలకు సమాచారం ఉంది.
బికెఐకి చెందిన సిక్కు ఉగ్రవాది వాధవా సింగ్ బబ్బర్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన రంజీత్ సింగ్ నీతా, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ పర్మ్జిత్ సింగ్ పంజవార్, ఎస్ఎఫ్జెకి చెందిన గురుపత్వంత్ సింగ్ పన్నూ ఐఎస్ఐతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. దేశంలో విధ్వంసానికి పంజాబ్‌లోని వీరంతా ఐఎస్ఐకి అన్నివిధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ జగదీష్ సింగ్ భురా, దాని డిప్యూటీ చీఫ్ ,SFJ అసోసియేట్ గుర్మీత్ సింగ్, రంజీత్ సింగ్ పఖోకే, పరమ్‌జిత్ సింగ్ పమ్మా, సుఖ్‌దేవ్ సింగ్ హెరాన్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జార్ వంటివారు ఐఎస్ఐతో టచ్ లో ఉన్నారు. భురా, పఖోకే , హెరాన్ మినహా మిగిలిన వారు UAPA కింద టెర్రరిస్టులే. ఉగ్రవాద ప్రణాళికలలో పాల్గొన్న సంస్థలలో ఒకటి లఖ్వీర్ సింగ్ ISYF. పంజాబ్, పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న గ్రామాలలో ISYF ప్రభావం ఎక్కువ. ఆ సంస్థ సభ్యులు, సానుభూతిపరుల్లో అత్యధికులు బాంబులు, ఇతర పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ పొందినవారే.
మరోవైపు ఇటీవలి కాలంలో, ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను పడవేయడానికి డ్రోన్లను ఉపయోగించడం భద్రతా ఏజెన్సీలకు పెద్ద సవాలుగా మారింది. పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో డ్రోన్లను ఉపయోగించిన 60 సంఘటనలు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చాయి. వీరిలో పలువురిని సరిహద్దు భద్రతా దళం కాల్చిచంపింది. ముఖ్యంగా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాల్లో చొరబాట్లను ఎదుర్కోవడానికి …కేంద్రం BSF అధికార పరిధిని మునుపటి 15 కి.మీ నుంచి 50 కి.మీలకు పెంచింది. అందుకోసం వెస్ట్ బెంగాల్, పంజాబ్ నోటిఫికేషన్‌ను వ్యతిరేకించాయి.
లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఇండియన్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్లతో సహా పాత టెర్రర్ గ్రూపులు పంజాబ్, యుపిలో స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌లను పునరుజ్జీవింప చేస్తున్నాయని నిఘావర్గాల నివేదిక స్పష్టం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి…. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఈ సంస్థలు జమ్మూ కశ్మీర్లో తమ కార్యకలాపాలను పెంచాయి.
లూథియానా పేలుళ్ల వెనక ఉన్నది సిక్కు ఉగ్రవాదసంస్థనే అని దర్యాప్తులో తేటతెల్లమైంది. ఈ కేసులో సిక్స్ ఫర్ జస్టిస్ కు చెందిన జస్విందర్ సింగ్ ముల్తానీతో సంబంధం ఉన్న డజనుమందికిపైగా అనుమానితుల్ని ఎన్ఐఏ గుర్తించింది. భారత ప్రభుత్వ అభ్యర్థనతో ముల్తానీని జర్మన్ పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్ఐ మద్దతు ఉన్న స్మగ్లింగ్ సిండికేట్‌తో సంబంధాలు ఉన్నాయని విచారణలో ముల్తానీ అంగీకరించారు. తేలింది. ముల్తానీ ఇచ్చిన వివరాల ఆధారంగా జర్మన్ పోలీసులు అతని సహచరులపై స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించారు. నిధులు, ఆయుధాలు, ఎక్స్ప్ల్ల ఏర్పాటు వెనుక ముల్తానీ హస్తం ఉందని ఎన్ఐఏ పేర్కొంది.
ఇక దావూద్ ఇబ్రహీం టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉన్న పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా తరలించిన సరుకులో కొంత భాగాన్ని ఢిల్లీలో ఇటీవలే స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్, పంజాబ్‌లలో ఇటీవలే గుర్తించిన పేలుడు సామగ్రి పాకిస్తాన్ నుంచి రవాణా అయిందేనని పోలీసుల అంచనా.
జనవరి 14 శుక్రవారం నాడు ఘాజీపూర్ పూల మార్కెట్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థం(ఐఇడి) పాకిస్తాన్లో తయారైందే. ఇది పాకిస్తాన్ నుంచి… ఉగ్రవాద స్లీపర్ సెల్స్ లేదా అక్కడి క్రిమినల్ ముఠాలు భూ రవాణా లేదా సముద్ర మార్గం గుండా పంపి ఉంటాయని పోలీసులు తెలిపారు.
జమ్ముకశ్మీర్, పంజాబ్ లో ఇంకా చాలా చోట్లనుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుజరాత్, యూపీలకు అలాగే సరఫరా చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఓ నివేదిక ప్రకారం, ఈ IEDలు సరిహద్దు గుండా భారతీయ స్లీపర్ మాడ్యూల్స్ కు చేరాయి. IED రికవరీ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు కలిగి ఉన్న టెర్రర్ మాడ్యూల్తో ముడిపడి ఉంది. ముంబై, లక్నో, అలహాబాద్, ఢిల్లీ అరెస్టులతో కీలక సమాచారం రాబట్టగలిగారు. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయాప్రాంతాల్లో పేలుళ్లకు పెద్దఎత్తున కుట్ర జరిగినట్టు తేలింది. సముద్రమార్గం నుంచి గుజరాత్ కు, భూమార్గం ద్వారా యూపీకి పేలుడుపదార్ధాలు చేరినట్టు ఢిల్లీ సెక్యూరిటీ ఏజెన్సీల విచారణలోనూ తేలింది. అందుకు ఇక్కడి స్లీపర్ సెల్స్ తోపాటు… కొన్ని క్రిమినల్ గ్రూప్స్ సహకారాన్ని ఉగ్రవాదసంస్థలు తీసుకుంటున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా హెచ్చరికల్ని జారీ చేస్తున్నామని…అందరూ అప్రమత్తంగా ఉంటే ఉగ్రదాడులను తిప్పికొట్టవచ్చునని అని సీనియర్ భద్రతాధికారులు అంటున్నారు.
ఘాజీపూర్ ఫ్లవర్ మార్కెట్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థం మూడు కిలోల ఆర్డిఎక్స్. అమ్మోనియం నైట్రేట్ సెకండ్ చార్జ్. బాల్ బేరింగ్‌లతో నింపిన స్టీల్ రూపంలో ఉన్న దాన్ని టిఫిన్ లో పెట్టి ఉంచి రిమోట్ తో పేల్చవచ్చు. పోలీసులు సకాలంలో అప్రమత్తమై దాన్ని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, శ్రీనగర్, పంజాబ్, ఒడిశాలో నిల్వఉంచిన టిఫిన్ బాంబులు, IED ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 14, శుక్రవారంరోజు పంజాబ్, జమ్మూ, కాశ్మీర్ మరియు న్యూఢిల్లీలో పేలడానికి సిద్ధంగా ఉన్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పైన చెప్పినట్టు ఘాజీపూర్ పూలమార్కెట్లో … ఆర్డిఎక్స్ ,అమ్మోనియం నైట్రేట్, టైమర్ , ఎలక్ట్రిక్ డిటోనేటర్ … కొన్ని ష్రాప్నెల్తో ఉన్న మూడు కిలోల పేలుడు పదార్థాల్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుంది ఆరోజే. ఐఈడీని నిర్వీర్యం చేసేందుకు ఎన్ఎస్జీ నియంత్రిత పేలుళ్లు నిర్వహించాల్సి వచ్చింది. అదే రోజు, ఒడిశాలోని మల్కన్‌గిరి పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ – ఒడిశా సరిహద్దుకు సమీపంలోని పాత కటాఫ్ ప్రాంతంలో భారీ పేలుడు పదార్థాల నిల్వను కూడా గుర్తించారు. అమృత్సర్ పోలీసులు…వాఘా-అట్టారీ సరిహద్దుకు సమీపంలోని ఓ గ్రామం నుంచి దాదాపు 5 కిలోల బరువున్న ఐఈడీని స్వాధీనం చేసుకుందీ జనవరి 14ననే. దావూద్ ఇబ్రహీంతో సంబంధమున్న బహుళ-రాష్ట్ర పాకిస్థాన్-వ్యవస్థీకృత టెర్రర్ మాడ్యూల్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.