హైదరాబాద్ నారాయణ గూడ లోని కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్ డిగ్రీ కాలేజీ విద్యార్థినికి జాతీయ స్థాయి ప్రశంసలు లభించాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెడుతున్న వేళ, కేంద్ర వార్షిక బడ్జెట్ మీద అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా కాలేజీ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దఫ దఫాలుగా స్క్రీనింగ్ పోటీలు జరిపారు. అందులో సెలక్ట్ అయిన విద్యార్థులకు కన్హా శాంతివనం కేంద్రంగా శిబిరం నిర్వహించారు. వందలాది విద్యార్థులకు మాక్ పార్లమెంటు నిర్వహించి కేంద్ర బడ్జెట్ , నారీ శక్తి మీద ప్రసంగించేలా అవకాశం ఇచ్చారు. ఈ జాతీయ స్థాయి పోటీలలో కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజీ లో బీబీఏ చదువుతున్న యలమంచిలి కావ్యశ్రీ రత్న టాప్ జాబితాలో స్థానం సంపాదించింది. నిర్దిష్ట సమయంలో నారీ శక్తి అంశం మీద చక్కటి ప్రజంటేషన్ అందించి కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రశంసలు పొందారు. తమ కాలేజీ తరపున విశిష్ట గుర్తింపు సంపాదించిన కావ్యశ్రీ కి కాలేజీ కార్యదర్శి డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ డాక్టర్తి స్రవంతి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మాధురి అభినందనలు అందించారు.



