ఇటీవలే రిలీజై విజయవంతంగా ఆడుతున్న కన్నడ మూవీ కాంతారాలోని వరాహరూపం పాట ప్రదర్శనను కేరళ హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. థియేటర్లు, ఇతర వేదికలపైనా ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. 2015లో విడుదలైన నవరసం అనే పాటనుంచి ఆ ట్యూన్ ను తస్కరించారని ఆరోపిస్తూ కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం.
ఈ మేరకు కోజికోడ్‌లోని జిల్లా కోర్టు హోంబలే ఫిల్మ్స్, రిషబ్ శెట్టి, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ తో పాటు…. కేరళ డిస్ట్రిబ్యూటర్లకు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. Amazon Music, Spotify, Wynk Music ,JioSaavn వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా పాటను ప్లేచేయడానికి లేదు.
కోర్టుకు వెళ్లకముందు కాంతారా నిర్మాతలపై చట్టపరమైన పోరాటానికి వెళ్తామని తైక్కుడం బ్రిడ్జ్ టీం ప్రకటించింది. తమ ‘నవరసం’ , కాంతారా లోని ‘వరాహ రూపం’ మ్యూజిక్ ఒకే రకంగా ఉన్నాయని ఆరోపించింది. అయితే నవరసం పాటనుంచి ప్రేరణ పొందే తాము వరాహరూపం చేశామని కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ ఒప్పుకున్నట్టు తెలిసింది. సామీప్యతలు ఉన్నమాట నిజమే కానీ..ఉద్దేశపూర్వకంగా తస్కరించడం కాదని చెప్పినా… అది 1957 కాపీరైట్ చట్టానికి విరుద్ధమని పిటిషన్ దారు అంటున్నారు.
కాంతారాకు రచనా సహకారం, హీరో , దర్శకుడు రిషబ్ షెట్టీనే. భూతకోలా, కంబాల వంటి కోస్తా కర్ణాటకలోని విభిన్న ఆచారాలు సంస్కృతులను చిత్రం ప్రతిబింబిస్తుంది.