రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేడుకలు కొనసాగాయి.
తెలంగాణ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లభించాల్సిన ఫలితాలు దేశ ప్రజలకు లభించ్చలేదని అన్నారు. దేశ ఉనికికే ముప్పు ఏర్పడే స్థాయికి అవాంఛిత, అనవసర పెడధోరణులు సమాజంలో పెరిగాయన్నారు. గుజరాత్ లో విద్యుత్ కోరతతో పంటలు ఎండిపోతున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ తెలంగాణాలో నిరంతర విద్యుత్ తో వెలుగులు వెలుగుతున్నాయన్నారు.
దేశానికి ఇప్పుడు కావాల్సింది రాజకీయ ఫ్రంట్ లు కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ఎవరినో ప్రధానిని చేసేందుకు కాదని.. నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానం రావాలసి ఉందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారాలంటూ ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని.. కొత్త రాజకీయ ఎజెండా కోసం మార్గం వెతకాలని ఆయన అన్నారు.
కేసీఆర్ గవర్నర్ వ్యవస్థ దుర్మార్గంగా మారిందన్నారు. గవర్నర్ వ్యవస్థ వక్రమార్గంలో నడుస్తోందన్నారు. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారన్నారు. తమిళనాడులో పంచాయితీ, బెంగాల్లో సైతం పంచాయితీ నడుస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రజల బలంతో గెలిచిన ఎన్టీఆర్ దుర్మార్గపు గవర్నర్ వ్యవస్థను గద్దె దించారన్నారు. అదే ఎన్టీఆర్‌ను ప్రజలు తిరిగి గద్దెను ఎక్కించారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మంత్రులు లేరని సీఎం కేసీఆర్ అన్నారు. అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.ఎందరో మహానుభావులు, శ్రేణుల కష్టమే టీఆర్ఎస్కు ఈ విజయం సాధించి పెట్టిందని తెలిపారు. కర్నాటకలో అవినీతికి పాల్పడిన ఒకరు మంత్రి పదవి కోల్పోయారని, ఆ పరిస్థితి తెలంగాణలో రాదన్నారు. ధరణి ద్వారా రైతులు, భూ యాజమాన్య సమస్య తీరిందని తెలిపారు. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామన్నారు. పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసరి ఆదాయం రూ.2,78,000ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.