కథక్ మాస్ట్రో పండిటి బిర్జూమహరాజ్ కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బిర్జూ కథక్ డాన్సర్ మాత్రమే కాక..మంచిగాయకుడు, కవి, డ్రమ్మర్ కూడా . లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహరాజ్ అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా. కథన్ నాట్యరీతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన కళాకారుడు బిర్జూమహరాజ్. పద్మవిభూషణ్ సహా..ఎన్నో పురస్కారాలు ఆయన్ని వరించాయి. సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్, నృత్య చూడామణి, ఆంధ్రరత్న, నృత్య విలాస్, ఆదర్శ శిఖర్ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, శిరోమణి సమ్మాన్, రాజీవ్ గాంధీ శాంతి పురస్కారం వంటివి ఆయన కీర్తికిరీటంలో చేరాయి. బనారస్ , ఖైరాగడ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.
గదర్ ఏక్ ప్రేమ్ కథా చిత్రంలోని ‘ఆన్ మీలో సజనా’ గీతం సహా పలు బాలీవుడ్ చిత్ర గీతాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. సత్యజిత్ రే చిత్రం ‘చెస్ కే ఖిలాడీ’’కి సంగీతం అందించారు. విశ్వరూపం చిత్రంలో ఆయన నృత్యానికి జాతీయ పురస్కారం వచ్చింది. బాజీరావ్ మస్తానీ లోని ‘మోహే రంగ్ దో లాల్ ‘ కు పాటకు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు బిర్జు మహరాజ్. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.