శ్రీనగర్ పాతబస్తీలో మహ్మద్ ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఓ కశ్మీర్ పండిట్ నడుపుతున్న కిరాణా దుకాణంలో ఇబ్రహీం సేల్స్ మన్ గా పనిచేస్తున్నాడు. ఛాతి, పొత్తికడుపుపై కాల్చడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు ఇబ్రహీంఖాన్. అయితే కశ్మీరీ పండిట్ దుకాణాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు అతని కొడుకుకు బదులుగా పొరపాటున ఇబ్రహీంను చంపిఉంటారని మృతుని కుటుంబసభ్యులంటున్నారు. జర్నలిస్ట్ ఆదిత్యరాజ్ ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. దూరంనుంచి కాల్పులకు తెగబడ్డ దుండగులు ఇబ్రహీం ఖాన్ ను షాప్ యజమానిగా భావించారని ఆదిత్యరాజ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
అటు షాపు యజమాని డాక్టర్ సందీప్ ను పోలీసులు అంతకుముందే అప్రమత్తం చేశారు. మధ్యహ్నం 3 గంటలకు పోలీసులు అతనికి ఫోన్ చేసి ఉగ్రవాదులు టార్గెట్ చేయవచ్చని చెప్పారు. ఇబ్రహీం రాత్రి తన కారులో స్టోర్ నుంచి బయల్దేరాడని..అక్కడే పొంచి ఉన్న ఉగ్రవాదులు నేనే అనుకుని తనను కాల్చి చంపారని సందీప్ చెప్పారు. అతని కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదని…తన చావుకు కారణం నేనేనన్న అపరాధభావన వెన్నాడుతోందని అన్నారు.
90లల్లో సందీప్ తండ్రిపైనా ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడే వారి కుటుంబం కొంతకాలం జమ్మూ, ఢిల్లీలో ఉంది. ప్రస్తుతం సందీప్ తండ్రి రోషన్ ఢిల్లీలో ఉంటుండగా సందీప్ భార్యాబిడ్డలతో కశ్మీర్లో ఉంటున్నారు. ఇప్పుడు తనను టార్గెట్ చేశారని..అయినా సరే కశ్మీర్ ను వీడబోనని…ప్రాణం పోయినా జన్మభూమిని విడిచిపెట్టలేనని అన్నారు.
ఈమధ్య ఉనికిలోని ఉగ్రసంస్థ జన్ బాజ్ ఫోర్స్ ఖాన్ ను చంపింది తామేనంటూ లేఖ విడుదల చేసింది. అయితే సందీప్ అతని తండ్రి రోషన్ లాలా మావాలే తన లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానికేతరులు కశ్మీర్ కు తీసుకురావడంలో వాళ్లు ముఖ్య పాత్ర వహించాలని అందులో పేర్కొన్నారు.
దీపావళి తరువాత లోయలో ఉగ్రవాదుల రెండో హత్య ఇది. రెండురోజుల క్రితం కొందరు ఉగ్రవాదులు బటామలూ ప్రాంతంలో 29 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ నూ చంపేశారు. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 10 మందిని ఇస్లామిక్ ఉగ్రవాదులు చంపేశారు. దీంతో కేంద్రం శ్రీనగర్లో హైఅలర్ట్ ప్రకటించింది. 5 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని కేంద్రం మోహరించింది.
https://twitter.com/AdityaRajKaul/status/1457999689911980032?s=20