స్వాతంత్య్ర సమరయోధులపై కర్నాటక ప్రభుత్వ వార్తాపత్రిక ప్రకటనలో దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫోటోను ఉంచకపోవడంపై వివాదాల క్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై నిన్న కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. బొమ్మై ఆర్ఎస్ఎస్ బానిసగా మారారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఆర్ఎస్ఎస్ ఆశయాలను చూసి తాను గర్విస్తున్నానని.. ఆర్ఎస్ఎస్ దేశభక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తానన్నారు. తాను, తన ప్రభుత్వం నెహ్రూను గౌరవిస్తాయని స్పష్టం చేసిన ఆయన.. 65 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఆయన పేరును ఉపయోగించుకొని దేశాన్ని పాలించింది అన్నారు. బీఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి దిగ్గజాలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ఆరోపించారు.
మేం నిన్నటి ప్రభుత్వ ప్రకటనలో కొంతమంది స్వాతంత్య్ర సమరయోధుల గురించి ప్రస్తావించాం, వారి గురించి మునుపెన్నడూ వినలేదు. దాని గురించి ఎవరూ మంచిగా మాట్లాడలేదు, కానీ దానికి బదులుగా వారు (కాంగ్రెస్) తమ నాయకుల పేర్లలో ఒకరి పేరు లేనందున బాధపడుతున్నారని బొమ్మై అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులపై పత్రికా ప్రకటనలో నెహ్రూను మినహాయించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీ ప్రభుత్వ చర్య దయనీయమైనదని పేర్కొంది.