బాలీవుడ్ హీరోయిన్ కంగానా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలి . ముంబైలో సినీ పరిశ్రమలో ఒకరకంగా పోరాటమే చేసిందని అనుకోవచ్చు. కెరీర్ పరంగా,, రాజకీయ ఆలోచనలు పరంగా … ఆమెకు చాలా శత్రువులు ఉన్నారు. అయినప్పటికీ మొండి గా దూసుకువెళ్లడం ఆమె అలవాటు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగానా.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యారు. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కంగానా.. ఇకనుంచి పూర్తి సమయం ప్రజాసేవకే అంకితం అని ప్రకటించారు. ఎంపీగా గెలిచాక సినిమాలు మానేస్తానని స్పష్టంగా వెల్లడించారు. అటు, కాంగ్రెస్ తరపున కూడా కంగనాకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈలోగా కంగానా మరో వివాదంలో ఇరుక్కున్నారు.
కంగానా రనౌత్ ఒక గ్యాంగ్ స్టార్ తో చక్కర్లు కొడుతున్నారు అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కంగానాతో నిలిచిన వ్యక్తి గ్యాంగ్ స్టార్ అబూ సలీం అని ,, అతడితో కంగానా పార్టీ చేసుకుంటుందని వివాదం జోరందుకొంది. సహజంగానే దీనిమీద సోషల్ మీడియాలో రెండు వైపులా కామెంట్ల యుద్ధం నడుస్తోంది. దీనికి కంగానా ఇన్ స్టా గ్రామ్ వేదికగా వివరణ ఇచ్చింది. అతగాడు గ్యాంగ్ స్టార్ కానే కాదు, కనీసం గ్యాంగ్ మనిషి కూడా కాదంటూ స్పష్టం చేసింది. ఫోటోలోని వ్యక్తి పేరు మార్క్ మ్యాన్యువల్ అని, ఆయన ఒక జర్నలిస్ట్ అని, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫోటోలు దిగాము అని వివరించారు.
ప్రస్తుతం కంగానా రనౌత్ ఒక కాంట్రవర్సీ సినిమా చేస్తున్నారు. ఎమర్జెన్సీ పేరుతో వస్తున్న ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయిన మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగానా నటిస్తున్నారు. ఆమెతో పాటు అనుపమ కేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమాన్ వంటి తారాగణం ఉన్నారు. ఈ సినిమాకు కంగానా రనౌత్ దర్శకత్వం చేపట్టడం మరో విశేషం. ఎన్నికల హడావిడి కారణంగా ఈ సినిమా విడుదల ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ లోగా ఈ సినిమా ప్రమోషన్ ఫోటో కాస్తా… గ్యాంగ్ స్టర్ పేరుతో కావలసినంత కాంట్రావెర్సీ ని తెచ్చి పెట్టింది.