నటుడు, మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారని తమిళనాట ప్రచారం జరుగుతోంది. కాదు కాదు కొద్దిరోజులు విరామం ప్రకటిస్తారనీ మరికొందరు అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుబ్యాంక్ గణనీయంగా పడిపోవడం సాక్షాత్తూ తానే కోయంబత్తూర్ నుంచి ఓడిపోవడం, అన్నింటికీ మించి ఇటీవలే ఆయన కరోనా బారిన పడి ఆరోగ్యం కూడా దెబ్బతినడం వంటి కారణాలతో ఆయన రాజకీయానికి సంబంధించి ఆయన పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. కోవిడ్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన కమల్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని కుటుంబసభ్యులు తెలిపారు. తరువాత కూడా ఇంకొంత కాలం ఆయన ఇంటిదగ్గరే ఉండి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు.అస్వస్థత వల్ల తన సినిమా షూటింగ్ లూ నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ కు మాత్రం శని, ఆదివారాలు షూటింగ్ లో పాల్గొంటారు. సొంత బ్యానర్ మీద కమల్ తెరకెక్కిస్తున్న విక్రమ్ మూవీ కూడా అర్థాంతరంగా నిలిచిపోయింది. ఆస్పత్రినుంచి డిశ్చార్డై కోలుకున్నాక రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
వచ్చే ఏడాది జరిగే స్థానిక ఎన్నికలకోసం పార్టీ సిద్ధంగా లేదు. నెలరోజుల నుంచి పార్టీ నుంచి ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు.. దీంతో కేడర్ పూర్తి అసంతృప్తిలో ఉంది. అయితే పుకార్లను నమ్మవద్దని పార్టీ ఇతర నేతలంటున్నారు. ప్రజలకు మంచి చేసేందుకు వచ్చిన కమల్ ఉన్నట్టుండి రాజకీయాలకు దూరం కాబోరని…కాస్త విరామం ప్రకటించే అవకాశాలు ఉంటే ఉండవచ్చని చెబుతున్నారు. మరి కమల్ రాజకీయాలకు విరామం ఇస్తారా…లేదా విరమణ ప్రకటిస్తారా…చూడాలి.