బీహార్ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. బీహార్ లో బీజేపీతో భాగస్వామ్యం ముగిసిపోయిందని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం నితీష్ కుమార్ నేడు రాష్ట్ర గవర్నర్ ను సాయంత్రం 4 గంటలకు కలవనున్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి. కాగా ఇటు జేడీయూ భేటీ జరుగుతున్న సమయంలోనే అటు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
జేడీ(యూ)లో సీనియర్ నాయకుడు ఆర్సీపీ సింగ్ గత కొద్ది రోజులుగా బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తూ నితీశ్ వ్యవహారశైలిని నిందిస్తూ వస్తున్నారు. శనివారం ఆయన హఠాత్తుగా పార్టీని వీడడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. నిజానికి ఆయనను కేంద్ర మంత్రిగా బీజేపీ ఏకపక్షంగా ఎంపిక చేసింది. ఆయన అమిత్‌షాకు దగ్గరవుతున్నట్లు గుర్తించిన నితీశ్.. ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ముందు నుంచీ.. కేంద్ర సర్కారులో రెండు బెర్తులు కావాలని నితీశ్ కోరినా.. బీజేపీ పట్టించుకోవడం లేదు. దాంతో మహారాష్ట్రలో శివసేన మాదిరి బిహార్‌లో జేడీ(యూ)లో చీలికలు తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని జేడీ(యూ) నితీశ్ అనుమానించారు. ఆర్సీపీ సింగ్ కూతురి అవినీతిపై నిలదీశారు. దాంతో ఆర్సీపీ సింగ్ రాజీనామా చేశారు.
బీజేపీ నుంచి దూరమైతే నితీశ్‌కు అండగా నిలుస్తామని బిహార్‌లోని ప్రతిపక్షాలు ప్రకటించాయి. రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తే స్వాగతిస్తామని కమ్యూనిస్ట్ పారీ్టలు వెల్లడించాయి.జేడీ(యూ)కు తోడుంటామని 12 మంది ఎమ్మెల్యేలున్న సీపీఐ(ఎంఎల్)ఎల్ పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల మహాగట్ బంధన్ కూటమి ఎమ్మెల్యేలు కూడా రబ్రీదేవి నివాసంలో భేటీ అయ్యారు.
మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఇవాళ ఉదయం ఉపముఖ్యమంత్రి తారాకిశోర్ ప్రసాద్ నివాసంలో బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఉన్న మొత్తం 16 మంది బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.