ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్ జిల్లాల బార్డర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ గురించి తెలిసిందే. ఈ ఘటనలో పెద్ద ఎత్తున జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ ఎన్కౌంటర్ ఘటన తర్వాత జవాన్ రాకేశ్వర్ సింగ్ జాడ తెలియకపోవడం కలకలం రేపింది. ఆయన ఆచూకీ కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చేపట్టాయి. అయితే ప్రస్తుతం ఆయన మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు.. ఈ విషయాన్ని మావోలు ఓ లేఖ రూపంలో ప్రకటించారు. జవాన్ రాకేశ్వర్ సింగ్ తమ వద్దే ఉన్నాడంటూ తెలిపారు.
మావోలు విడుదల చేసిన లేఖలో కొన్ని డిమాండ్లను కూడా చేశారు. “ఆపరేషన్ ప్రహార్-3” పేరుతో మావోయిస్టు వ్యతిరేక ఆపరేన్లు చేపడుతున్నారని.. దేశంలో హక్కుల కోసం జరిగే ఉద్యమాలను కూడా అణచివేయడం జరుగుతోందని.. ఇందుకు పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ చర్యలను నిలిపివేయాలంటూ లేఖలో
డిమాండ్ చేశారు.
అంతేకాదు.. ఏప్రిల్ 25వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా జరిగే అన్ని ప్రజా ఉద్యమాలకు మావోయిస్టుల మద్దతు ఉంటుందని.. ఈ ఉద్యమాలకు సపోర్టుగా విప్లవాత్మక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఏప్రిల్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా భారత్ బంద్ పాటించాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చారు.
కాగా, జవాన్ రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యులు స్పందించారు. తన తండ్రిని విడిచిపెట్టండి ప్లీజ్ అంటూ ఆయన కూతురు కన్నీరు మున్నీరవుతోంది. ఆ చిన్నారి మాటలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. జవాన్ కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వాడికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టవద్దని.. దయచేసి విడిచిపెట్టండంటూ కోరుతున్నారు.