వాలంటైన్స్ డే కాదు.. ఇది ఒక బ్లాక్ డే.. సైనిక సోదరులకు వందనం
………………………………………….
నేడు ఫిబ్రవరి 14. వాలంటైన్స్ డే పేరుతో .. ప్రేమ సందడి కనిపిస్తున్నప్పటికీ, ప్రతి భారతీయుడి గుండెల్లో పుల్వామా ఉగ్రదాడి నాటి చేదు జ్ఞాపకం పచ్చిగానే ఉంది. 2019లో ఇదే రోజున జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన కిరాతక దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆ సైనిక సోదరుల స్మృతిలో భారతావని నేడు కన్నీటి నివాళులు అర్పించాలి.
……………………………………
దేశభక్తి మరియు కర్తవ్య నిర్వహణ మిన్న అని చాటిచెప్పిన ఆ అమరవీరుల త్యాగాలను దేశం నేడు ‘బ్లాక్ డే’గా స్మరించుకోవాలి.. సరిహద్దుల్లో మంచులోనూ, ఎండలోనూ దేశ రక్షణ కోసం పహారా కాస్తూ, తమ కుటుంబాన్ని విడిచి మనందరి క్షేమం కోసం పోరాడే సైనికులే నిజమైన నాయకులు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమరవీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి, మౌనం పాటించి వారి ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటున్నారు.
………………………………………
ఫిబ్రవరి 14, 2019 మధ్యాహ్నం పుల్వామా అటాక్ చోటుచేసుకుంది. జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో సుమారు రెండు వేల మందికి పైగా జవాన్లు ఉన్నారు. నేషనల్ హైవే 44 పై పుల్వామా జిల్లాలోని లేథిపొరా వద్దకు ఈ కాన్వాయ్ చేరుకొన్నప్పుడు అటాక్ జరిగింది. ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ సుమారు 300 కిలోల పేలుడు పదార్థాలతో నిండిన తన వాహనాన్ని … జవాన్లు ప్రయాణిస్తున్న ఒక బస్సుతో బలంగా ఢీకొట్టాడు. పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర శబ్దం వినిపించగా, సమీపంలోని ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ భీకర దాడిలో 40 మంది భారతీయ జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందారు. వందల మంది గాయాల పాలయ్యారు.
………………………………………………………….
ఈ సందర్భంగా … విలాసవంతమైన వేడుకల కంటే సైనిక సోదరులకు సంఘీభావం తెలపడమే ప్రధానమని చాటాల్సిన అవసరం ఉంది.. “ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అమరవీరుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, జవాన్ల పరాక్రమం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అదే స్ఫూర్తితో మనమంతా కూడా సైనిక సోదరులకు సంఘీభావం తెలియచేద్దాము.



