చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు నిన్నసోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఇళ్లల్లో కూడా బుధవారం ఐటీ దాడులు జరిగాయి. ఇవాళ కూడా తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఉద్యోగులు, ప్రొడక్షన్ మేనేజర్లను కూడా విచారించి వివరాలు తీసుకున్నారు. రెండోరోజు సంస్థ ఉద్యోగులను కార్యాలయానికి పిలిపించి వారి వేతనాలకు సంబంధించిన వివరాలు అడిగారు.
పుష్ప సినిమా నిర్మాణం కోసం దాదాపు 5 వందల కోట్లు విదేశాలనుంచి వచ్చాయని అనుమానిస్తున్నారు. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా హవాలా పద్ధతిలో సొమ్మును తరలించినట్టు సమాచారం అందిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఐటీ దాడుల నేపథ్యంలో పుష్ప-2 సినిమా షూటింగ్ ను చిత్రయూనిట్ వాయిదా వేసింది. ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల రిలీజ్ సమయంలోనూ మైత్రీ మూవీ మేకర్స్పై ఐటీ రైడ్స్ జరిగాయి. అప్పుడు చూపించిన లెక్కలకు.. ప్రస్తుత లెక్కలకు భారీ వ్యత్యాసం ఉన్నట్టు ఐటీ గుర్తించింది. ముఖ్యంగా 500 కోట్ల హవాలా మనీపైనే ఫోకస్ చేస్తోంది. మైత్రీ మూవీస్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు నిర్మిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా నడుపుతోంది.
పుష్ప మూవీ నిర్మాణ వ్యయం 150 కోట్లు కాగా… 300 కోట్లు వసూలయ్యాయి. డైరెక్టర్ సుకుమార్ పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 2019లో 8 కోట్లు పెట్టి మూడు అంతస్తుల విల్లా కొనుగోలు చేశారు డైరెక్టర్. ఇంటీరియర్ డిజైనింగ్ కి 11 కోట్లు వెచ్చించారని… ఇటాలియన్ మార్బల్ ఫర్నిచర్ కే ఐదు కోట్లు అయ్యాయని చెబుతున్నారు. అందుకు సంబంధించిన అకౌంట్స్ , బ్యాంక్ స్టేట్ మెంట్స్ క్రాస్ చేస్తున్నారు ఐటీ అధికారులు. అంతేకాదు పుష్ప 1,2 సినిమాలకు 60 కోట్లు పారితోషికంగా తీసుకున్న ఆయన… రంగస్థలం మూవీకి 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు.అయితే అందులో కేవలం 10 శాతం మాత్రమే లెక్కలో చూపించినట్టు తెలిసింది.
ఇక 2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్.. వరుసగా ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ‘రంగస్థలం, ‘ఉప్పెన, ‘పుష్ప, ‘సర్కారు వారి పాట, ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్లను నిర్మించింది. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ సినిమాను నిర్మిస్తోంది. అలాగే, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కూడా ప్రాజెక్టులు చేస్తోంది.అన్ని సినిమాలూ స్టార్ హీరోలతో నిర్మిస్తున్నవే.