వివాహం కోసం హిందూయువత మతంమారడం సరికాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అన్నారు. పెళ్లి అనేచిన్న కారణాలతో అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వధర్మం, సంప్రదాయాలపట్ల గౌరవభాగం కలిగిఉంటూ వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పెళ్లివంటి వ్యక్థిగత స్వార్థంతో ఒకమతం నుంచి మరో మతానికి మారడమేంటని ప్రశ్నించారు. ఎంతమంది పిల్లలు సక్రమంగా పెంచుతున్నారని ప్రశ్నించారు.హిందూ కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ మతాచారాలను, సంప్రదాయాలను, విలువలను నేర్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు ఏవైనా ప్రశ్నలుంటే…వాటికి సమాధానాలు ఇవ్వండి కానీ… గందరగోళానికి గురికావద్దనీ మార్గదర్శనం చేశారు.
ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లపై తమ పిల్లలు ఏమి చూస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం గురించి ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. “ఒటిటి ప్లాట్‌ఫారమ్‌లు అన్ని రకాల విషయాలను చూపుతాయి. మీడియాలో వచ్చేవి పిల్లలకు, మన విలువ వ్యవస్థకు ఏది మేలు చేస్తుందనే దృక్పథంతో కాదు. మన పిల్లలకు ఇంట్లో ఏమి చూడాలి, ఏమి చేయకూడదో నేర్పించాలి ” అని భగవత్ సూచించారు.
యువత మాదకద్రవ్యాలకు బానిసలవడంపైనా భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థలోని సద్గుణాలను ప్రశంసిస్తూ, పశ్చిమ దేశాలు భారతీయ కుటుంబ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నాయని భగవత్ చెప్పారు. అదే సందర్భంలో ఈ విలువలను నాశనం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆయన హెచ్చరించారు. “ప్రజలను బానిసలుగా ఉంచడానికి, పశ్చిమ దేశాలు చైనాకు నల్లమందు పంపాయి. యువత నల్లమందుకి అలవాటు పడింది. తరువాత పశ్చిమ దేశాలు చైనాను పాలించాయి” అని ఆయన గుర్తు చేశారు.
భారతీయులు ఎల్లప్పుడూ తమ సంపదను ఇతరులతో పంచుకునేవారని భగవత్ చెప్పారు. మొఘలులు వచ్చే వరకు భారతదేశంలో చాలా సంపద ఉందని ఆయన గుర్తు చేశారు. 1 వ శతాబ్దం నుండి 17 వ శతాబ్దం వరకు – దేశంలో మొఘల్ దోపిడీ ప్రారంభానికి ముందు – భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత సంపన్న దేశం. అందుకే దీనిని బంగారు పక్షి అని పిలిచేవారని వివరించారు.
సాంప్రదాయక కుటుంబ విలువలు, ఆచారాలను పరిరక్షించాల్సిన అవసరంలో భాగంగా…దేశంలోని పర్యాటక స్థలాన్ని సందర్శించాలని… సంప్రదాయ వస్త్రాలు ధరించడంతో పాటు… మన సంస్కృతితో అనుసంధానమయ్యేందుకు భాష, ఆహారం, భక్తి భావన, పర్యాటకం, వస్త్రధారణ, ఇళ్లు ముఖ్యమని…అంటరానితనం వంటి జాడ్యాన్ని అంతం చేయాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.