జమ్మూ కాశ్మీర్ అంశం మీద పాకిస్తాన్ చేస్తున్న విషపు ప్రచారం బండారాన్ని భారత్ బట్ట బయలు చేసింది. ఉద్దేశపూర్వకంగానే పాకిస్తాన్ బురద జల్లుతోంది. అని ఆధారాలతో సహా భారత్ బయటపెట్టింది. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న పాకిస్తాన్ వైఖరి మార్చుకోకపోతే ఆ దేశానికే నష్టం కలుగుతుంది అని హితవు పలికింది.
అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ వైఖరి సక్రమంగా లేదు. ఇటీవల
ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తద్వారా ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పాక్, భారత్‌ల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ మెలికలు పెడుతోంది.
కాశ్మీర్ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ కాస్త ఘాటుగా స్పందించింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగిందని భారత్ స్పష్టం చేసింది.
దీంతో అనివార్యంగా పరిణామాలను ఆహ్వానిస్తుందంటూ పాక్‌పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతినిధి భవిక మంగళానందన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉగ్రవాదానికి పాకిస్థాన్ దోహదకారి అని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాదంలో ఈ దేశానికి చాలా చరిత్రే ఉందన్నారు. సీమాంతర ఉగ్రవాదం ఆ దేశ యొక్క విధానమని తెలిపారు.
పాకిస్తాన్ వ్యవహార శైలిని అంశాలవారీగా భారత్ బట్టబయలు చేసింది.
మిలటరీ ఆధీనంలో పాకిస్థాన్ నడుస్తుందని గుర్తు చేశారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల వ్యాపారంతోపాటు అంతర్జాతీయ నేరాలకు సైతం పాకిస్థాన్ ప్రపంచ ఖ్యాతి పొందిందన్నారు. అలాంటి పాకిస్థాన్.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం దాడి చేసే సాహసానికి దిగుతుందని మండిపడ్డారు. అయినా పాకిస్తాన్ నిజ స్వరూపం ఏమిటన్నది ప్రపంచానికి తెలుసునన్నారు. అందుకు 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2008లో ముంబయిలో దాడి ఘటనలను ఈ సందర్భంగా భావిక మంగళానందన్ ప్రస్తావించారు.
అంతర్జాతీయ వేదికల మీద కూడా పాకిస్తాన్ వైఖరి ఏమాత్రం మారలేదు అని మరోసారి రుజువు అయింది.