సరిహద్దు ప్రాంతాల విషయంలో చైనా ను గుడ్డిగా నమ్మడం సరికాదని భారత్ భావిస్తోంది. ఒకవైపు వివిధ ప్రాంతాల్లో సరిహద్దుల నుంచి సైనిక బలకాలను ఒప్పందం మేరకు ఉప సంహరించు కుంటున్నారు. కానీ కీలకమైన ప్రాంతాలలో మాత్రం సరిహద్దు బలగాలను భారత్ కొనసాగిస్తున్నది. ఉదాహరణకు లడఖ్ ప్రాంతంలో ఇప్పటికీ 50 వేల మంది సైనికులను భారత్ గస్తీ లో ఉంచుతోంది.
డెమ్చోక్ మరియు దేప్సాంగ్ సెక్టార్ల దగ్గర మాత్రం ఒప్పందం మేరకు బలగాలను కొంత మేర తగ్గిస్తున్నారు.
రెండు దేశాల మధ్య సమగ్రమైన ఉపశమనాన్ని సాధించే వరకు మరి కొన్ని ప్రాంతాలలో బలగాలను వెనక్కి పిలిపిస్తారు.
ఏప్రిల్ 2020లో చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి గణనీయమైన బలగాలను మోహరించినప్పుడు ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
అప్పటినుంచి రెండు పక్షాలు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలని మోహరించాయి. కానీ గత నెలలో భారతదేశం మరియు చైనా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా కొంతమేర సైనిక బలగాలను ఉపసంహరించు కుంటున్నారు. వివిధ ప్రాంతాలలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి. సైనికులతో గస్తీ కాయటం కన్నా,, డ్రోన్ వంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఈ డ్రోన్ల కదలికలకు అంతరాయం కలిగించకూడదని రెండువైపుల నుంచి అనుకుంటున్నారు. ఫలితంగా చాలావరకు మ్యాన్ పవర్ మరియు ఆయుధాల వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
అయినప్పటికీ చైనాని గుడ్డిగా నమ్మవద్దు అని మాజీ సైనిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. సున్నిత ప్రాంతాల్లో మాత్రం గస్తీని పటిష్టంగానే కొనసాగిస్తున్నది. అందుచేతనే సంక్లిష్టమైన ప్రాంతాలలో సాయుధ బలగాలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.