ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు పెద్దపీట వేస్తున్నారు . నిపుణులు , శాస్త్రవేత్తలకు కావలసిన వసతులను స్పష్టమైన మార్గంలో అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా అనేక రంగాల్లో భారతీయ శాస్త్రవేత్తలు అద్భుతాలు సాధిస్తున్నారు.
ముఖ్యంగా అంతరిక్ష రంగంలో మోడీ ప్రభుత్వ హయాంలో ఇస్రో వరుస విజయాలను సాధిస్తోంది. అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానం చేయడం చాలా క్లిష్టమైన పని కాగా ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే.. ఈ ఘనతను సాధించాయి. తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఇది ఒక చరిత్రాత్మక క్షణం అని ఇస్రో పేర్కొంది. 15 మీటర్ల నుంచి 3 మీటర్ల హోల్డ్ పాయింట్ వరకు ఈ డాకింగ్ పూర్తి అయినట్లు ప్రకటించింది. అత్యంత ఖచ్చితత్వంతో డాకింగ్ ప్రక్రియను ప్రారంభించగా, అది విజయవంతంగా అనుసంధానం అయిందని పేర్కొంది.
అంతరిక్ష సాంకేతికతలో గణనీయమైన మైలురాయిని సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అభినందించారు.
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్లో భాగంగా శాస్త్రవేత్తలు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 (పీఎస్ఎల్వీ-సీ60) వాహననౌక ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను పీఎస్ఎల్వీ-సీ60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
అనంతరం SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) ఉపగ్రహాలను రోదసిలో వాటిని అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఉపగ్రహాలను తాజాగా విజయవంతంగా అనుసంధానం చేసినట్లు ఇస్రో తెలిపింది.
మొత్తం మీద ఇస్రో విజయం మీద దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.