కోనసీమ జిల్లా మురమళ్ళలో నెలకొని ఉన్న శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి క్షేత్రము ఎంతో ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం నిర్వహిస్తారు. అలాగే ఈ గుడికి ప్రతీ రోజు చెట్టు కొమ్మలు తెచ్చి తోరణం కడుతూ ఉంటారు.
అందుచేతనే నిత్య కళ్యాణం పచ్చ తోరణం గుడిగా ఇది ప్రసిద్ధి పొందింది. ఒకరకంగా ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం అయినప్పటికీ,, ఇటీవల కాలంలో ఈ గుడి బాగా పేరు తెచ్చుకున్నది.
పెళ్ళికాని యువతీ యువకులకు ఈ ఆలయం కొంగు బంగారం. ఇక్కడ పూజలు చేయిస్తే, మరి ముఖ్యంగా సాయంత్రం కళ్యాణం చేయిస్తే.. తప్పకుండా వివాహం అవుతుందని భక్తుల నమ్మకం.
అందుచేతనే ప్రతిరోజు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ఈ కళ్యాణం కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుని సౌకర్యం రావడంతో పెద్ద సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వస్తున్నారు.
భక్తుల తాకిడి పెరగడంతో దేవాలయం సిబ్బంది మరియు అర్చకులు కూడా చొరవ తీసుకుని సేవలు అందిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి మర్యాదలతో నాణ్యమైన సేవలు అందుతున్నాయి. ఈ సేవల్ని పరిశీలించిన పిమ్మట అంతర్జాతీయ నాణ్యతా సంస్థ ఐఎస్ఓ.. తన గుర్తింపు పత్రాన్ని అందించింది.
దేవాలయాలకు నాణ్యత గుర్తింపు పత్రం రావడం అరుదు అనే అనుకోవాలి. భక్తులకు పూర్తిస్థాయిలో నాణ్యమైన సేవలు అందితేనే ఇది సాధ్యమవుతుంది. సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాసరాజులకు ఐఎస్వో సంస్థ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏదైనా ఒక సంస్థ నాణ్యత, భద్రత, సామర్థ్యం, పనితీరును నిర్థారించడానికి ఐఎస్ఓ ధ్రువీకరణ దోహదపడుతుంది.
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఈ మురముళ్ళ క్షేత్రం ఉంది. కాకినాడ , అమలాపురం పట్టణములకు సమీపంలో ఇది నెలకొని ఉంది. పచ్చని పొలాల మధ్య ఈ ఆధ్యాత్మిక కేంద్రం భాసిల్లుతోంది. నిత్య కల్యాణ శోభితుడైన భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఇక్కడ కొలువుదీరారు. పదేళ్లుగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ వసతులు సైతం అదే స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని వీరేశ్వర అన్నదాన ట్రస్టు ద్వారా అందిస్తున్నారు.
రాబోయే కాలంలో కూడా ఇదే మాదిరిగా నాణ్యమైన సేవలు అందిస్తామని ఆలయ అర్చకులు మరియు అధికారులు చెబుతున్నారు.