
గత యెనిమిది ఏళ్ల మోదీ పాలనలో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనం అయ్యింది అంటున్నారు. ఈ కింది చార్ట్ చూస్తే ఆగస్ట్, 2013 నుండి జూలై, 2022 వరకు డాలరుతో రూపాయి మారకం విలువ 15% క్షీణించిన మాట నిజమే కానీ అదే సమయంలో యూరోతో పోల్చితే 11.75%, బ్రిటన్ పౌండ్ తో 9.5%, ఆస్ట్రేలియన్ డాలరుతో 10%, కెనడియన్ డాలరుతో 5% పెరిగింది.
అర్థ శాస్త్రం తెలియని వారికి దేశ, విదేశ ఆర్థిక వ్యవస్థల గురించి అర్థం చేసుకోవడం, అందులోనూ కరెన్సీ మార్కెట్ గురించి తెలుసుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. వీలైనంత వరకు సులభంగా అర్థమయ్యే విధంగా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
ప్రపంచంలో ఉన్న దాదాపు 200 పై చిలుకు దేశాలు తమ సొంత కరెన్సీని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఒకదేశం మరొక దేశంతో వర్తక వాణిజ్యాలు నిర్వహించాలి అంటే అందుకు తగిన ధనాన్ని చెల్లించాలి. ఉదాహరణకు భారతదేశం ముడిచమురు కొనాలి అంటే రూపాయలు చెల్లించి కొనలేదు. ఎందుకంటే మన రూపాయి ఆ దేశంలో చెల్లదు కాబట్టి. అందుకోసం భారతదేశం రూపాయలతో డాలర్లు కొని ఆ డాలర్లతో ముడిచమురు కొంటుంది.
దేనికైనా మార్కెట్లో డిమాండ్ ఉంటే దాని విలువ క్రమంగా పెరుగుతూ ఉండటం సహజం. ఒక్క భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా గల్ఫ్ దేశాల నుండి ముడి చమురు కొనాలంటే ఆయా దేశాల కరెన్సిలను ఉపయోగించి డాలర్లు కొనుగోలు చేసి గల్ఫ్ దేశాలకు చెల్లించాల్సి ఉంటుంది.
మరి డాలర్లలోనే యెందుకు చెల్లించాలి అంటే డాలర్ అనేది అంతర్జాతీయంగా అనేక దేశాలు అంగీకరించిన కరెన్సీ కావడం వలన మరియు ఆయా దేశాల వారు ఎగుమతుల ద్వారా స్వీకరించిన డాలర్లను, తమ దేశానికి చేసుకునే దిగుమతుల చెల్లింపులకు వాడుకునే అవకాశం ఉండటం వలన.
మీరు ఎప్పుడైనా విదేశీ యాత్రలకు వెళ్తే ఆయా దేశాల్లో ఖర్చు చేయడం కోసం మన రూపాయలతో డాలర్లు కొనుగోలు చేసి, ఆ దేశం వెళ్ళాక ఈ డాలర్లను అక్కడి స్థానిక కరెన్సీలోకి మార్చుకుని ఖర్చు చేసి ఉంటారు. ఒకవేళ చెల్లింపులకు క్రెడిట్ కార్డులు ఉపయోగించి ఉంటే ఈ కన్వర్షన్ ప్రాసెస్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. నేనైతే నా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉపయోగించి హాంగ్ కాంగ్, ఫిలిఫైన్స్ దేశాలలో అక్కడి ఎటియంలో నగదు కూడా విత్ డ్రా చేశాను.
ఒక్క ముడిచమురు అనే కాదు మనం వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకునే రసాయనిక ఎరువులు, బంగారం, ఆయుధాలు, సైనిక పౌర విమానాలు, కంప్యూటర్లు, ఔషధాల తయారీలో వినియోగించే ముడి పదార్థాలు, వంట నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు ఇలా ప్రతిదానికి మనదేశం డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే మనదేశం కూడా విదేశాలకు అనేక వస్తుసేవలను ఎగుమతులు చేయడం ద్వారా డాలర్లను స్వీకరిస్తుంది. దిగుమతుల కన్నా ఎగుమతుల విలువ ఎక్కువగా ఉంటే దేశంలో డాలర్ల నిల్వ అధికంగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఉంటే దిగుమతులకు చెల్లింపులు చేయడానికి మనం అదనంగా డాలర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఎగుమతుల కన్నా దిగుమతుల విలువ ఎక్కువ.
స్టాక్ మార్కెట్లో నిత్యం షేర్ల ట్రేడింగ్ జరిగినట్లే కరెన్సీ మార్కెట్లో కూడా కరెన్సీల ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయా కరెన్సీలో డిమాండ్, సప్లై ఆధారంగా వాటి విలువ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ట్రేడింగ్ జరిగే వాటిలో షేర్లు, కరెన్సీలే కాకుండా కమోడిటీస్, బులియన్, క్రిప్టో కరెన్సీ వంటివి కూడా రోజు ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. (కొన్ని మార్కెట్లు నిర్ణీత వేళల్లోనే పనిచేస్తాయి)
ఇప్పుడు కరెన్సీ మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అంతర్జాతీయ కరెన్సీగా చెలామణి అవుతున్న డాలర్ ఆధిపత్యానికి త్వరలోనే గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా మరియు యూరోపియన్ దేశాలు రష్యా మీద అనేక ఆంక్షలు విధించాయి. అందులో అంతర్జాతీయ చెల్లింపులకు ఉపయోగపడే స్విఫ్ట్ సిస్టం నుండి రష్యా దేశాన్ని తొలగించడం వంటి ఆర్థిక ఆంక్షలు ముఖ్యమైనవి. రష్యా తను సరఫరా చేసే ముడిచమురు, సహజ వాయువు కొనుగోలు చేయాలంటే రష్యన్ రూబుల్లలో మాత్రమే చెల్లింపులు చేయాలని కండిషన్ పెట్టడంతో అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో రష్యన్ రూబుల్ విలువ అమాంతం పెరగడం మొదలైంది.. ఇంధన అవసరాలు నిమిత్తం రష్యా సరఫరా చేసే సహజ వాయువు మీదనే ఆధారపడి ఉన్న యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా పెట్టిన షరతులకు లోబడి రష్యన్ రూబుల్లలో కొనుగోలు చేస్తున్నాయి.

ఇటీవల భారతదేశం కూడా గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతార్ నుండి చమురు కొనుగోలు చేయడానికి డాలర్ల బదులు రూపాయల్లో చెల్లింపులు చేయడానికి ఒప్పందం చేసుకుంది. మరికొన్ని దేశాలతో వస్తు వినిమయ (బార్టర్) ఒప్పందాలు చేసుకుంది. మరోవైపు ఛైనా కూడా డాలర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా గత దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వచ్చే రోజుల్లో చైనా తైవాన్ ఆక్రమణకు పూనుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు మరలా చోటు చేసుకునే అవకాశం ఉంది.
మున్ముందు రూపాయి మారకం విలువ మరింత పతనం కూడా అయి తొంభై, వందకు కూడా చేరుకోవచ్చు. మరి మనదేశ కరెన్సీ విలువ పెరగాలి అంటే దేశం నుండి ఎగుమతులు భారీగా పెరగాలి అదే సమయంలో దిగుమతులు గణనీయంగా తగ్గాలి. దిగుమతులు తగ్గాలి అంతే దిగుమతి చేసుకుంటున్న వస్తువులను మన దేశంలోనే ఉత్పత్తి చేయాలి. భారతదేశం ఆత్మనిర్భర్ అయినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇది ఒక్కరోజులో లేదా ఒక్క సంవత్సరంలో జరిగే పనికాదు. ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కనీసం రెండు దశాబ్దాలు కృషి చేస్తేనే సాధ్యం అవుతుంది.
~ నాగరాజు మున్నూరు